Kajol opens up on daughter Debut | బాలీవుడ్లోకి తన కూతురు నైసా దేవ్గణ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే వార్తలపై క్లారిటీనిచ్చింది నటి కాజోల్ దేవ్గణ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆమె మాట్లాడుతూ.. చాలామంది స్టార్ కిడ్స్ మాదిరిగా నైసాకు నటిగా మారే ఉద్దేశం లేదని కాజోల్ స్పష్టం చేసింది. ”నా కూతురు సినీ రంగంలోకి రావడం లేదు. ఆమెకు ఇప్పుడు 22 ఏళ్లు, తన భవిష్యత్తుపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె సినీ పరిశ్రమలో కాకుండా వేరే రంగంలోకి వెళ్లాలని అనుకుంటోంది” అని కాజోల్ వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలతో నైసా బాలీవుడ్లో అడుగుపెట్టబోతుందన్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది.
అలాగే నెపో-బేబీ వివాదంపై కాజోల్ మాట్లాడుతూ.. మీరు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజే తెలుసుకోవాల్సిన విషయం.. ఇక్కడ మంచి, చెడు రెండు ఉంటాయని. మీరు విమర్శలకు గురవుతారని మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని విమర్శలు కఠినంగా, కొన్ని అసంబద్ధంగా, భయంకరంగా ఉంటాయి. అయితే ఇవి తట్టుకుని నిలబడితేనే మీరు ఇండస్ట్రీలో రాణిస్తారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాంటివి ఎదుర్కోవాలి. వారికి తప్పించుకునే ఛాయిస్ ఉండందంటూ కాజోల్ చెప్పుకోచ్చింది.
అయితే నైసా వేరే కెరీర్ను ఎంచుకున్నప్పటికీ ఈ ఏడాది పలువురు స్టార్ కిడ్స్ బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ, కాజోల్ మేనల్లుడు ఆమన్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ 2025లో అరంగేట్రం చేశారు. ఇక, శనయ కపూర్ విక్రాంత్ మాస్సే సరసన తన ఎంట్రీని ఇవ్వగా, అహాన్ పాండే తన బ్లాక్బస్టర్ డెబ్యూ ‘సైయారా’తో అందరి దృష్టిని ఆకర్షించారు.