ఆపదలోవున్న ఓ అమ్మాయిని రక్షించే ప్రయత్నంలో విఫలం అవుతుంది సత్య. తన చేతుల్లోనే ఆ అమ్మాయి ప్రాణాలు విడుస్తుంది. తనను కాపాడలేకపోయాననే అనే బాధతో కుమిలిపోతుంటుంది. ఈ దుర్మార్గం చేసిన వ్యక్తుల్ని ఎలాగైనా పట్టుకుని చట్టానికి అప్పజెప్పాలని నిర్ణయించుకుంటుంది. కానీ పై అధికారులు ‘ఈ కేస్‌తో నీకు సంబంధం లేదు’ అంటారు.
కానీ ఆ అమ్మాయి తన చేతిలోనే ప్రాణాలు వదిలిందని పై అధికారులకు నచ్చజెప్పాలని చూస్తుంది సత్య. కానీ ప్రయోజనం లేదు. ఇక చట్టాన్ని అతిక్రమించి అమాయకురాలైన యువతిని చంపిన హంతకుల వేట మొదలుపెడుతుంది. ఇంతకీ ఆ దుర్మార్గుల్ని సత్య పట్టుకుందా? అనే ప్రశ్నకు సమాధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యభామ’. టైటిల్‌రోల్‌ని కాజల్ పోషించారు.
సుమన్ చిక్కాల దర్శకుడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మాతలు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ని శుక్రవారం విడుదల చేశారు. హంతకుల వేటలో ఉన్న సత్యను ఇతిహాసాల్లో నరకాసురుడ్ని చంపిన సత్యభామతో పోలుస్తూ వస్తున్న నేపథ్య సంగీతం ఈ టీజర్లో హైలైట్‌గా నిలుస్తుందని, ఆసక్తికరమైన కథాకథనాలతో సినిమా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రకాశ్‌రాజ్, నవీన్‌చంద్ర, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: బి.విష్ణు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సమర్పణ: శశికిరణ్ తిక్క