17 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నానని అంటోంది పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. రోలర్ కోస్టర్రైడ్గా సాగిన ఈ ప్రయాణంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని అంటోంది. గత రెండేళ్లుగా తన జీవితంలో చోటుచేసుకున్న మార్పులను గురించి కాజల్ అగర్వాల్ వెల్లడిస్తూ ‘ ఖాళీగా కూర్చోవడం నాకు నచ్చదు. 365 రోజులు ఏదో ఒక పనిచేస్తూనే ఉంటా. లాక్డౌన్ వల్ల దొరికిన ఈ విరామంలో ఆస్ట్రోఫిజిక్స్, భగవద్గీతతో పాటు పౌరాణిక అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవడానికి ఆన్లైన్ క్లాస్‌లకు హాజరయ్యాను. ఈ పాఠాల వల్ల ఎలాంటి కల్మషం లేకుండా నిజాయితీ, స్వచ్ఛతతో జీవితాన్ని గడపటం ఎలాగో తెలుసుకున్నా. వంటలు చేయడంలో మెళకువలను అమ్మ ద్వారా నేర్చుకున్నా. పెళ్లి తర్వాత అత్తయ్య నాకు కుట్లు, అల్లికలు నేర్పించింది. అలాగే కరోనా విపత్తు వల్ల కుటుంబానికి, వృత్తిబాధ్యతల మధ్య సమతుల్యం పాటించడం ముఖ్యమని అర్థంచేసుకున్నా. ఉరుకులుపరుగులతో కూడిన ఈ జీవితంలో స్వీయ ఆనందాల కోసం సమయాన్ని కేటాయించాలని తెలిసింది. ధ్యానం, వర్కవుట్స్ ద్వారా సానుకూల దృక్పథాన్ని అలవర్చుకున్నా’ అని తెలిపింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయని, వాటి విషయంలో తాను ఏరోజు ఇతరుల్ని నిందించలేదని చెప్పింది. ఒకే ఒరవడికి పరిమితం కాకుండా విభిన్న పాత్రలు చేసినప్పుడే నటులకు సంతృప్తి ఉంటుందని, ఆ స్థాయికి తాను చేరుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది.