Myanmar : మయన్మార్‌లో దారుణ ఘటన జరిగింది. ఒక బౌద్ధ ఆశ్రమంపై మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 14 మంది మరణించారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన మయన్మార్‌లోని రెండో పెద్ద పట్టణమైన మండాలేకు సమీపంలో ఉన్న సగెయింగ్ రీజన్, మ్యాయుంగ్ టౌన్షిప్ పరిధిలోని స్వెల్ లే హో గ్రామంలో జరిగింది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.00 గంటలకు ఈ దాడి జరిగింది. మ్యాయుంగ్ టౌన్‌షిప్‌కు సంబంధించిన రక్షణ వ్యవహారాలు చూసే సీడీఎస్ఓఎం అనే సంస్థ తరఫున న్వాయ్ ఊ అనే ప్రతినిధి ఈ వివరాల్ని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం ఇక్కడి ఆశ్రమంలో ధ్యానానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. ఇది వారం రోజులపాటు జరిగే ప్రత్యేక కార్యక్రమం. దీనికోసం అందరూ సమావేశమై ఉండగా, మయన్మార్ సైన్యం వైమానిక దాడి జరిపింది. ఆశ్రమం మధ్యలో బాంబు జారవిడిచింది. దీంతో భారీ పేలుడు కారణంగా 14 మంది మరణించారు.
మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో మరణించిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రస్తుతం వారి పరిస్థితికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మయన్మార్‌లో కొంత కాలంగా తీవ్ర సంక్షోభం, అంతర్యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆధీనంలోని ఆర్మీకి, అలాగే ప్రజాస్వామ్య సంఘాలకు, మతపరమైన, సంప్రదాయపరమైన సాయుధ బలగాలకు మధ్య ఘర్షణ ఏళ్లుగా కొనసాగుతోంది. దీంతో తరచూ ఆర్మీ, వేరే సంస్థల వారిపై దాడులు చేస్తోందని బాధిత గ్రూపులు ఆరోపిస్తున్నాయి.