దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘కాంత’. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథాంశమిది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం దుల్కర్ సల్మాన్ పుట్టినరోజుని పురస్కరించుకొని టీజర్‌ను విడుదల చేశారు. కెరీర్ ఆరంభంలో మంచి స్నేహితులైన నటుడు చంద్రన్, రచయిత దర్శకుడు అయ్యల మధ్య కాలక్రమంలో విభేదాలు తలెత్తుతాయి. అయ్య తన మొదటి హారర్ చిత్రం ‘శాంత’ను నాయికా ప్రధానంగా రూపొందిస్తారు.
స్టార్ నటుడైన చంద్రన్ ఈ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకొని తన ఇమేజ్‌కు అనుగుణంగా స్క్రిప్ట్‌ను మార్చి ‘కాంత’ అనే టైటిల్‌ను పెడతాడు. ఈ నేపథ్యంలో జరిగే ఘటనలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. 1950ల నాటి కాలమాన పరిస్థితులను ప్రతిబింబించే సెట్స్ ప్రధానాకర్షణగా నిలిచాయి. సముద్రఖని కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఝను చంతర్, నిర్మాతలు: రానా, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.