Kaantha Movie | తెలుగులో ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన తాజా చిత్రం ‘కాంత’. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్‌తో పాటు సముద్రఖని, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ బోర్సే వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రమోషన్స్‌లో రానా దగ్గుబాటి సైతం ఈ చిత్రంతో దుల్కర్‌కు జాతీయ అవార్డు ఖాయమని నమ్మకం వ్యక్తం చేశారు. మరి ఆ నమ్మకం నిజమైందా? ‘కాంత’ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ
1950ల నాటి సినీ నేపథ్యంతో సాగే ఈ కథలో టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్) ఓ సూపర్‌స్టార్. అతన్ని స్టార్‌గా తీర్చిదిద్దిన గురువు, డైరెక్టర్ చంద్రన్ (సముద్రఖని). అయితే వీరిద్దరి మధ్య విభేదాల కారణంగా వీరి కాంబినేషన్లో మొదలైన ‘శాంత’ అనే చిత్రం మధ్యలోనే ఆగిపోతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడనంతగా వీరి మధ్య జరిగిన గొడవ ఏంటి? కొన్నేళ్ల తర్వాత మళ్లీ అదే సినిమాను తిరిగి పట్టాలెక్కించడం వెనుక కథేంటి? హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) పాత్ర ఏమిటి? సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ మర్డర్ మిస్టరీ కథను ఎలా మలుపు తిప్పింది? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘కాంత’ కథాంశం.
విశ్లేషణ:
1950ల నాటి సెట్టింగ్‌లు, కార్లు, కేశాలంకరణ, దుస్తులు, కెమెరాలు… ఇలా ప్రతిదీ ప్రేక్షకులను ఆ బ్లాక్ అండ్ వైట్ యుగానికి తీసుకెళ్లేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం అద్భుతంగా ఉంది. స్టూడియో సెట్టింగ్‌లు, షూటింగ్ హడావిడిని కళ్లకు కట్టినట్లు చూపించారు. మణిరత్నం ‘ఇద్దరు’, ‘మహానటి’ ఛాయలు కనిపించినా, కథనం మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం దుల్కర్, సముద్రఖని మధ్య సాగే అహంకార, ఆధిపత్య పోరాట సన్నివేశాలు సినిమాకు హైలైట్. ఇద్దరూ పోటాపోటీగా నటించారు. ముఖ్యంగా సముద్రఖని చెప్పిన ఒక సీన్‌ను దుల్కర్ అభినయించిన తీరుకు థియేటర్లలో చప్పట్లు పడతాయి. గతంలో గ్లామర్ పాత్రలు చేసిన భాగ్యశ్రీ ఈ సినిమాలో నటనతో పూర్తిగా ఆకట్టుకుంటుంది. దుల్కర్‌తో ఆమె కెమిస్ట్రీ, సన్నివేశాలు బాగున్నాయి. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కథనాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. సెకండాఫ్ మొత్తం మర్డర్ మిస్టరీగా మారుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా రానా దగ్గుబాటి ఎంట్రీ ఇచ్చి, తన ఈజీ నటనతో ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలకు బూస్ట్‌నిచ్చారు. క్లైమాక్స్‌లో హంతకుడిని కనిపెట్టే తీరు ఆకట్టుకుంటుంది. పాటలు అంతగా గుర్తుంచుకునేలా లేకపోయినా, జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్.. దుల్కర్, సముద్రఖనిని మహదేవన్, అయ్య పాత్రలకు ఎంచుకోవడంలోనే సగం విజయం సాధించారనే చెప్పాలి.
తీర్పు
సాధారణ కామెడీ, లవ్, ఫైట్స్ ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమా పూర్తిగా నచ్చకపోవచ్చు. కానీ, నటీనటుల లోతైన, బరువైన నటనను, ఒక చక్కని కథనంతో కూడిన సినిమాను చూడాలనుకునే వారికి ‘కాంత’ మంచి అనుభూతినిస్తుంది. దుల్కర్ సల్మాన్, సముద్రఖని ఇద్దరూ అవార్డుల కోసం పోటీ పడ్డారా అన్నట్లుగా నటించారు. దుల్కర్‌కు నేషనల్ అవార్డ్ నమ్మకం బలపడేలా ఆయన నటన ఉంది.
రేటింగ్: 3.25/5