Kantara 2 |రిషబ్‌శెట్టి కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార’ (2022) చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. ఆధ్యాత్మిక థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ప్రస్తుతం దీనికి ‘కాంతార: చాప్టర్-1’ పేరుతో ప్రీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘కాంతార’కు ముందు జరిగిన కథ ఇది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే కర్ణాటక కుందాపూర్ సమీపంలోని అరణ్యంలో చివరి షెడ్యూల్‌ను ఆరంభించారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ ప్రీక్వెల్ షూటింగ్‌కు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇటీవలే షూటింగ్ సందర్భంగా ఓ క్రూమెంబర్ నదిలో మునిగి చనిపోయారు.
అంతకుముందు జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడింది. గాలివానకు భారీ సెట్స్ నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ యుద్ధ ఘట్టం కోసం 500 మంది సుశిక్షితులైన ఫైటర్స్‌తో పాటు దాదాపు 2500 మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకున్నట్లు తెలిసింది. ఇలా 3000 మందితో యుద్ధ ఘట్టాన్ని తెరకెక్కించడం భారతీయ సినిమాలో ఇదే ప్రథమమని చెబుతున్నారు. ఈ సీక్వెన్స్ కోసం జాతీయ, అంతర్జాతీయ ఫైట్ కొరియోగ్రాఫర్స్ పనిచేశారని చిత్రబృందం చెబుతున్నది.