దక్షిణాదిలో సాయిపల్లవి క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటే ఈ తమిళ సోయగం బలమైన కథా చిత్రాలకే ప్రాధాన్యతనిస్తుంది. ఆమె ఒక సినిమాను ఒప్పుకుందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉందని ప్రేక్షకులు నమ్ముతారు. తనదైన అద్భుతాభినయంతో దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న ఈ భామ ఇప్పుడు హిందీలో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నది.
రణబీర్‌కపూర్ నటిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో సాయిపల్లవి సీత పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా తొలిభాగం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా కంటే ముందే సాయిపల్లవి హిందీలో ఓ చిత్రాన్ని అంగీకరించింది.
అమీర్‌ఖాన్ మేనల్లుడు జునైద్ ఖాన్ అందులో కథానాయకుడు. సాయిపల్లవి నటించిన తొలి హిందీ చిత్రమిదే కావడం విశేషం. కొద్ది మాసాల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ‘మేరే రహో’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్రబృందం శుక్రవారం వెల్లడించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.