ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పానిండియా సినిమా షూటింగ్ ఇటీవలే అధికారికంగా మొదలైన విషయం తెలిసిందే. అయితే.. ఆ షూటింగ్లో ఎన్టీఆర్ మాత్రం పాల్గొనలేదు. ఆయన లేని సన్నివేశాలను ప్రశాంత్‌నీల్ చిత్రీకరించారు. తాజాగా ఈ పానిండియా ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ తన ఎక్స్(ట్విటర్) వేదిక ద్వారా పంచుకున్నది. ఈ నెల 22 నుంచి మొదలుకానున్న ఈ సినిమా మలి షెడ్యూల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు, కీలక సన్నివేశాలతోపాటు కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. భారతీయసినీ చరిత్రలో ఓ మార్క్‌ని క్రియేట్ చేసేలా ఈ సినిమా ఉంటుందని వారు తెలిపారు. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. రుక్మిణీ వసంత్ కథానాయిక. మలయాళ నటుడు టొవినో థామస్ కీలక పాత్రలో సందడి చేయనున్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఏడాది జనవరి 9న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్.