Pahalgam Terror Attack | జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం అంతా ఉలిక్కిపడేలా చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత దారుణమైన ఉగ్రదాడి ఇదే. దీనిని అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న ప్రధాని మోదీ.. హుటాహుటిన బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఇక క్రూరమైన చర్యకు పాల్పడినవారిని వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా ఉద్ఘాటించారు. సినీ సెలబ్రిటీలు సైతం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.
మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మంచు విష్ణు వంటి వారు దీనిపై రియాక్ట్ అయ్యారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పహల్గామ్ టూరిస్ట్ ప్రాంతంలో అమానవీయంగా కాల్పులు జరపడం యావత్ భారత్ ఉలిక్కిపడేలా చేసింది. పహల్గామ్లో జరిగింది కేవలం ప్రాణాలపై దాడి కాదు, మానవత్వంపై జరిగిన దాడి, ఉగ్రవాదానికి మతం లేదు, మా నాయకులు తగిన ప్రతిస్పందన ఇస్తారని నేను నమ్ముతున్నాను.. మేం ఐక్యంగానే ఉన్నాం` అని మోహన్ బాబు అన్నారు. మినీ స్విట్జర్లాండ్‌గా పిలవబడే జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి వార్తతో నేను చలించిపోయాను. 27 మంది అమాయక పర్యాటకుల మరణాలు, 20 మంది గాయపడటం చాలా దారుణం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, కేంద్ర బలగాలతో పూర్తి సమన్వయం ఉండేలా చూసుకోవాలని, పర్యాటకులు, స్థానిక పౌరుల ప్రాణాలను కాపాడటానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని వెల్లడించారు పవన్ కళ్యాణ్. ఇక రామ్ చరణ్ కూడా స్పందిస్తూ.. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇలాంటి సంఘటనలకు మన సమాజంలో స్థానం లేదు. దీన్ని తీవ్రంగా ఖండించాలి అని అన్నారు రామ్ చరణ్. పహల్గామ్ దాడి బాధితుల గురించి తెలిసి హృదయం ద్రవించిపోయింది . దాడిలో మరణించిన వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇక మంచు విష్ణు రియాక్ట్ అవుతూ, పహల్గామ్ లో జరిగిన పిరికి దాడి హృదయ విదారకం. ఇలాంటి క్షణాల్లో మనం మరింత బలంగా నిలబడాలి. దుఃఖంలో ఐక్యంగా ఉండాలని అన్నారు. ఇలా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ మృతులకి సంతాపం తెలియజేస్తున్నారు.