NTR | గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న నార్నే నితిన్ – శివానీ జంట చివరికి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అక్టోబర్ 10న హైదరాబాద్ శివారులోని శంకర్పల్లి లో ఈ స్టార్ వెడ్డింగ్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వేడుకలో జూనియర్ ఎన్టీఆర్,లక్ష్మీ ప్రణతి,కల్యాణ్ రామ్,దగ్గుబాటి వెంకటేష్ , రానా, సురేశ్ బాబు, రాజీవ్ కనకాల తదితరులు హాజరై కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు. సినీ, రాజకీయ రంగ ప్రముఖుల రాకతో పెళ్లి వేడుక గ్లామర్ వాతావరణం సంతరించుకుంది.
నితిన్-శివానీ పెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తన బామ్మర్ది పెళ్లి ఏర్పాట్లను జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి మరీ చూసుకున్నాడట. అతిథుల ఆతిథ్యం నుంచి వేడుక డెకరేషన్ వరకూ ఎన్టీఆర్ చురుకుగా పాల్గొన్నాడని సమాచారం. అంతేకాదు, నితిన్–శివానీకి పెళ్లి కానుకగా ఎన్టీఆర్ ఒక లగ్జరీ కార్ గిఫ్ట్‌గా ఇచ్చాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినా, ఈ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.
నార్నే నితిన్ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆయన కుమారులు అభయ్ , భార్గవ్ లు వేడుకలో చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ క్షణాలను ఆస్వాదిస్తూ కనిపించారు. నార్నే నితిన్ ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నార్నే శ్రీనివాసరావు కుమారుడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు కూడా.నితిన్ 2023లో విడుదలైన ‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ‘ఆయ్’ సినిమాతో మరో విజయం సాధించాడు. ఈ ఏడాది ‘మ్యాడ్ స్క్వేర్’ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇటీవలే ‘వార్ 2’ సినిమాతో అభిమానులను అలరించాడు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో హీరోయిన్గా రుక్మిణీ వసంత్ నటిస్తోంది.