ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా అనగానే.. తారక్ అభిమానుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. పైగా పానిండియా స్థాయిలో మైథలాజికల్ మూవీ అనగానే ఆ సంతోషం రెట్టింపయ్యింది.
ప్రస్తుతమైతే ప్రశాంత్‌నీల్ ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నారు తారక్. వెంకటేశ్ సినిమాతో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. వీరిద్దరు చేయబోయే పానిండియా సినిమా మొదలు కావాలంటే ముందు ఈ రెండు సినిమాలు పూర్తవ్వాలి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మిడిల్లో ఈ సినిమాను పట్టాలెక్కిస్తారట. ఇది పౌరాణిక చిత్రం కావడంతో ఓ ఏడాది పాటు బల్క్ డేట్స్ త్రివిక్రమ్‌కే కేటాయించారట తారక్. ఆ సినిమా పూర్తయేంతవరకూ మరో సినిమా చేయకూడదని కూడా ఆయన డిసైడ్ అయ్యారట.
కార్తికేయ పురాణంలోని కీలక ఘట్టం ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన పుస్తకాన్ని కూడా చదవమని తారక్‌కి ఇచ్చారట త్రివిక్రమ్. ఈ మధ్య చాలా చోట్ల ఆ పుస్తకంతోనే దర్శనమిచ్చారు తారక్. ఆ పాత్రను ఓన్ చేసుకునేందుకు అంతగా ప్రయత్నిస్తున్నారాయన. 2027 చివర్లో కానీ, 2028 సంక్రాంతికి గానీ సినిమాను విడుదల చేయాలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ భావిస్తున్నారట.