Jd chakravarthy | టాలీవుడ్ నటుడు,దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న జేడీ చక్రవర్తి, తన పాత్ర గురించి మాట్లాడుతుండగా ఒక సరదా సంఘటన చోటుచేసుకుంది. తన చేతిపై ఉన్న టాటూ గురించి చెప్పబోతూ మధ్యలో మర్చిపోవడంతో, హోస్ట్ ఆ విషయాన్ని గుర్తు చేశారు. దీనికి జేడీ చమత్కారంగా “నిన్ను చూసినప్పుడు అన్నీ మర్చిపోయా” అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి.
అంతటితో ఆగకుండా హోస్ట్ ఆయన చేయి పట్టుకుని టాటూ గురించి అడగగా, “ట్రోలింగ్ చేయొద్దు” అంటూ జేడీ సరదాగా స్పందించారు. తర్వాత ఆయన చేతిపై ‘డాడ్’ అని ఉన్న టాటూను గమనించిన హోస్ట్, నవ్వుతూ “కాస్త దూరంగా ఉండటం మంచిది” అని వ్యాఖ్యానించారు. ఈ ఫన్నీ సంభాషణ ప్రస్తుతం నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ఇక టాటూ వెనుక ఉన్న కథ గురించి జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, “ఈ టాటూకి, ‘గాయపడ్డ సింహం’ సినిమాకి ఒక కనెక్షన్ ఉంది. నిజానికి ఈ టాటూ ఆధారంగా ఒక సినిమా కూడా తీసేయొచ్చు. నేను సరదాగా చెప్పడం కాదు, నిజమే” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ కథ ఏమిటో మాత్రం వెల్లడించకుండా సస్పెన్స్ కొనసాగించారు.
ఇంకా మాట్లాడుతూ సినిమా సెట్స్‌కు వెళ్లినప్పుడు నా ఫోటోకి దండ వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. అది కథలో భాగమా? లేక వేరే అర్థమా? అని అనిపించింది. కానీ దర్శకుడు దానికి మంచి కథ చెప్పారు. నా టాటూ, ఫోటో, దండ కలిసి కథలో కీలకంగా ఉంటాయి” అని తెలిపారు. తన కెరీర్ గురించి కూడా జేడీ మాట్లాడారు. ప్రతి నటుడి ప్రయాణంలో విజయాలు, అపజయాలు సహజం. కానీ కొన్ని పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాకు ‘మనీ’, ‘అనగనగా ఒక రోజు’ సినిమాలు అలాంటివే. చాలా కాలం తర్వాత అలాంటి గుర్తుండిపోయే పాత్ర ఈ సినిమాలో వచ్చింది అని చెప్పారు. సినిమాలో పలువురు దర్శకులు నటించారని, ఇది కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చిన చిత్రం అని జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చెప్పిన టాటూ సీక్రెట్, సినిమాలోని సస్పెన్స్ అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ‘గాయపడ్డ సింహం’ విడుదలయ్యాక ఈ మిస్టరీ ఎలా బయటపడుతుందో చూడాలి.