విజయాల విషయంలో బాలీవుడ్ ఈ మధ్య కాలంలో వెనుకపడ్డ మాట వాస్తవం. స్త్రీ2, ఛావా లాంటి అరుదైన మెరుపులు కూడా అప్పుడప్పుడే తారసపడుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో సీనియర్ బాలీవుడ్ రచయిత జావేద్ ఆక్తర్ ఈ విషయంపై మాట్లాడారు. ‘గతంతో పోలిస్తే బాలీవుడ్ సినిమాలకు హిందీ ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నారు. ముక్కూ మొహం తెలియని దక్షిణాది హీరోల సినిమాలు ఇక్కడ వందలకోట్లు వసూలు చేస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలు ఇలా వెనుకబడటంపై మీ అభిప్రాయం ఏంటి?’అని అదే వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ అగ్ర నటుడు ఆమిర్‌ఖాన్‌ను జావెద్ ప్రశ్నించారు. దీనిపై ఆమిర్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో హిందీ రచయితలు, దర్శకులు కాస్త ఎక్కువ స్వేచ్ఛ తీసుకుంటున్నారేమో!?. శ్రుతిమించిన శ్రద్ధతో మూలాలు మరిచిపోతున్నారేమో!?. భావోద్వేగాలను మిళితం చేయడంలో, జీవితాల్లోని వివిధ కోణాలను స్పృశించడంలో మనం వెనుకబడుతున్నామేమో!?. నావరకూ నా మనసు లోతుల్లో ఏది అనిపిస్తే అదే చేస్తా. హిట్ ఫ్లాపుల గురించి అస్సలు ఆలోచించను. ప్రతి దానికీ హంగులు, రంగులు దిద్దాల్సిన పనిలేదు.
కథ, కథనాలపై దృష్టి పెడితే చాలు. కచ్చితంగా సినిమా బాగా వస్తుంది. ’ అని కరాఖండీగా చెప్పారు ఆమిర్‌ఖాన్. ఇంకా మాట్లాడుతూ ‘సినిమాకు ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. అది అసలు సమస్యే కాదు. మనం అవలంభిస్తున్న బిజినెస్ మోడలే ఈ తిరోగమనానికి కారణమని నా అభిప్రాయం. ‘మా సినిమాను దయచేసి చూడండి.. ఒకవేళ చూడకపోతే ఎనిమిది వారాల తర్వాత మేమే మీ ఇంటికి పంపిస్తాం’ అని రెండు ఆప్షన్లు ఆడియన్స్‌కి మనం ఇస్తున్నాం. వాళ్లు ఎంచక్కా ఎనిమిది వారాల తర్వాతే ఇంట్లో (ఓటీటీ) సినిమా చూస్తున్నారు. అసలు ఒకే ఉత్పత్తిని రెండుసార్లు విక్రయించడం అనే ప్రక్రియ వల్ల తలెత్తుతున్న సమస్యలివన్నీ. నాకు వేరే ఆప్షన్ లేకపోతే నేను కచ్ఛితంగా థియేటర్‌కే వస్తా. అంతేకాదు, ప్రస్తుతం ప్రేక్షకుడు సినిమాను ఎక్కడ్నుంచైనా చూడొచ్చు. ఇక థియేటర్లకు వెళ్లాల్సిన పనేముంది? మన బిజినెస్ మోడల్‌తో మనమే మన సినిమాలను చంపుకుంటున్నాం.’ అంటూ వెల్లడించారు ఆమిర్‌ఖాన్.