‘స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య’ అనేది ఆర్యోక్తి. ఈ నీతిని తూ.చ తప్పక పాటిస్తున్నది శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. తనలోని లోపాలను సరిచేసుకునే క్రమంలో తాను పడిన కష్టాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘మానసిక వేదన, శారీరక శ్రమ నుంచి బయట పడేందుకు ఒకానొక సందర్భంలో నేనూ మద్యాన్ని ఆశ్రయించాను. నిదానంగా అది వ్యసనంలా మారింది. చివరికి మద్యం సేవించకపోతే ఉండలేని స్థితికి వచ్చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో.. మెడిటేషన్ నా జీవితాన్ని మార్చింది. నిద్రలేవగానే శారీరకంగా, మానసికంగా విపరీతమైన అలసట. బలహీనపడుతున్న మానసిక దృఢత్వం.. ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. చివరకు నా శరీరక స్పందనలు నాకే నచ్చడంలేదు. నాలో వస్తున్న మార్పులన్నీ నన్ను పునఃసమీక్షించుకునేలా చేశాయి. దాంతో ఇక తాగకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం క్రమంగా కుదురుకున్నది. మానసిక ఉల్లాసానికి మద్యమే మందు కాదు. ఈ విషయం ప్రతిఒక్కరూ గ్రహించాలి’ అన్నారు జాన్వీకపూర్.