కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే నటిగా తనను తాను నిరూపించుకోవడం సాధ్యమవుతుందని అంటున్నది బాలీవుడ్ తార జాన్వీ కపూర్. ఈ క్రమంలో తనకు ‘ఉలాజ్’ అనే సినిమా దక్కిందని ఆమె తెలిపింది. ఈ సినిమాలో తాను ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు జాన్వీ చెప్పింది. ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ నిర్మాణంలో జాతీయ అవార్డ్ గ్రహీత దర్శకుడు సుధాన్షు సరియా రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సినిమా ప్రకటన సందర్భంగా జాన్వీ కపూర్ స్పందిస్తూ…‘ఈ సినిమా స్క్రిప్ట్ చదివినప్పుడు అందులోని అంశాలు నన్నెంతో ఆకర్షించాయి. సినిమా పేరు లాగే నా పాత్రలోనూ అనేక లేయర్స్, పారామీటర్స్, ఎమోషన్స్ ఉంటాయి. నటిగా సవాలు లాంటి సినిమా ఇది. ప్రేక్షకులు నన్ను తెరపై సరికొత్తగా చూడబోతున్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి పాత్రలో నటిస్తుండటం సంతోషంగా ఉంది. దర్శకుడు సుధాన్షు సరియా ఫ్రెష్ అప్రోచ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు’ అని చెప్పింది. ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ చిత్రంలో జాన్వీ హీరోయిన్గా నటిస్తున్నది.