‘అమరన్’ సినిమాపై ప్రశంసలు కురిపించింది అగ్ర కథానాయిక జాన్వీకపూర్. ఈ ఏడాది తాను చూసిన అత్యుత్తమ చిత్రమిదేనని చెప్పింది. శివకార్తీకేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ చిత్రం దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా స్ఫూర్తివంతంగా తెరకెక్కించారు. దేశభక్తి, ప్రేమ, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పటికే పలువురు సినీ తారలు ఈ సినిమా గొప్పతనాన్ని కొనియాడారు. తాజాగా ఆ వరుసలో జాన్వీకపూర్ చేరింది. ఈ సినిమా చూడటం చాలా ఆలస్యమైందని, ప్రతీ సన్నివేశం హృదయాన్ని కదిలించిందని, భావోద్వేగంతో కళ్లు చెమర్చాయని చెప్పింది. ‘2024లో నేను చూసిన గొప్ప సినిమా ఇదే. అదొక దృశ్యకావ్యం. ఇలాంటి మంచి సినిమాతో ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పడం ఆనందంగా ఉంది’ అని జాన్వీకపూర్ సోషల్‌మీడియాలో పేర్కొంది. ‘దేవర’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన జాన్వీకపూర్ తొలిప్రయత్నంలోనే భారీ విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ రామ్‌చరణ్‌తో కలిసి గ్రామీణ క్రీడానేపథ్య చిత్రంలో నటిస్తున్నది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైంది.