‘బయటనుంచి ఇండస్ట్రీకి వచ్చినవారి కష్టాలు వినడానికి అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగినవాళ్ల కష్టాలు ఎవరూ వినరు.’ అని శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ వాపోయారు. ఇటీవలే ‘ఇన్సైడర్ వర్సెస్ అవుట్‌సైడర్’ అనే చర్చలో పాల్గొన్న ఆమె పై విధంగా స్పందించారు. ‘వీళ్లు బయట నుంచి వచ్చినవాళ్లు. వీళ్లు సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు అని విభజించడం నాకిష్టం లేదు. ఇక్కడ ఎవరి కష్టాలు వాళ్లకుంటాయి.
స్టార్ కిడ్స్ అయినంత మాత్రాన ఇబ్బందులు వుండవని ఎలా అంటారు? ఉన్నా మేం బయటపడం. ఎందుకంటే ‘మేం కష్టపడుతున్నాం’ అని చెబితే ఎవరూ నమ్మరు. బయటనుంచి వచ్చినవారు ఇక్కడ నిరూపించుకోవాలంటే ఎన్నో పోరాటాలు చేయాలని నేనూ అంగీకరిస్తా. కానీ కష్టపడకుండా ఎవరికీ ఏదీ రాదు. వారికైనా మాకైనా.. అది ఎవరైనా అంగీకరించాల్సిందే.’ అంటూ చెప్పుకొచ్చారు జాన్వీకపూర్.