ఏ వ్యసనమైనా విలాసం కాదనీ, అది ఓ మానసిక రోగమని అంటున్నది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. షూటింగ్లతో ఎప్పుడూ బిజీగా ఉండే జాన్వీ.. సామాజిక అంశాలపైనా బాధ్యతతో వ్యవహరిస్తుంటుంది. మద్యపానం, దాని వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తుంటుంది. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి.. మద్యపానంపై ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ సందర్భంగా మద్యపానం, దాని వల్ల కలిగే ఇబ్బందుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. “మద్యానికి బానిసలైన వ్యక్తులను, వారి వ్యక్తిత్వాన్ని ఎవరూ తక్కువ చేయొద్దు. నిజానికి మద్యపానంతో పాటు ఏ వ్యసనమైనా.. చెడు అలవాటు కాదు. ఒక మానసిక సమస్య మాత్రమే. ఒత్తిడి, బాధలు, వ్యక్తిగత సమస్యల వల్లే చాలామంది వాటికి అలవాటు పడతారు.
అలాంటివారిని నేరస్తుల్లా కాకుండా.. రోగుల్లా చూడాలి. వారిని విమర్శించడం, దూరంగా ఉంచడం వంటివి చేయొద్దు. వారికి ప్రేమను పంచాలి. తోటివారి నుంచి సానుభూతి, మద్దతు లభిస్తేనే అలాంటి వారు త్వరగా మారతారు” అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ. మద్యపానం తన జీవితంపైనా ప్రభావం చూపిందని వెల్లడించింది. “నేను కూడా అప్పుడప్పుడూ మద్యం తీసుకునేదాణ్ని. కానీ, కొన్నిరోజులకు నాకు తెలియకుండానే దానికి బానిసగా మారిపోయా! వ్యసనం అంటే మనతో ఎవరో అపరిచిత వ్యక్తి ఉనట్టే అనిపిస్తుంది. మన ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వచ్చేది. ఈ అలవాటు గురించి గతంలో నేనెప్పుడూ మాట్లాడలేదు. కానీ, నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఈ సమస్యతో బాధపడటం చూసిన తర్వాత, ఇది మానసిక ఆరోగ్య సమస్య అని అర్థమైంది. ఈ వ్యసనం వల్ల జీవితంలో ఎన్నో కోల్పోతామనీ, ఎంతో నష్టపోతామని తెలిసిన తర్వాత.. ఏం చేయాలనే దానిపై అవగాహన వచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. దేవర చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది జాన్వీ. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్దిలో నటిస్తున్నది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నది.