Jana Nayagan | దళపతి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో లీక్ అయిందన్న వార్తలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేయగా.. తాజాగా సీబీఎఫ్సీ అధికారికంగా స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. సెన్సార్ బోర్డు ప్రకారం.. ‘జన నాయగన్’ మూవీ లీక్ అయ్యిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న భద్రతా వ్యవస్థలు అత్యంత కట్టుదిట్టంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా సినిమా కంటెంట్‌ను రక్షించేందుకు కీ డెలివరీ మెసేజ్ (KDM) సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నామని వివరించింది. ఈ విధానం ద్వారా సినిమా కాపీకి యాక్సెస్ పూర్తిగా పాస్వర్డ్ ఆధారంగా ఉండటంతో అనధికారికంగా లీక్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంది.
అలాగే, సినిమా డిజిటల్ సినిమా ప్యాకేజీ (DCP) మార్చి 17న ముంబైలో అధికారికంగా నిర్మాతకు అందజేసినట్లు వెల్లడించింది. ఆ తరువాత నుంచి ఆ కంటెంట్ పూర్తిగా నిర్మాత ఆధీనంలోనే ఉందని సీబీఎఫ్సీ స్పష్టం చేసింది. మరోవైపు, సినిమా లీక్ అంశంపై చిత్ర నిర్మాణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో లింకులు షేర్ చేసిన ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపించిన వాటర్‌మార్క్ ఆధారంగా లీక్ ఎక్కడి నుంచి జరిగిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.
చిత్ర బృందం కూడా ఈ విషయంపై కఠినంగా స్పందిస్తూ.. లీక్ అయిన కంటెంట్‌ను డౌన్లోడ్ చేయడం, షేర్ చేయడం, చూడడం కాపీరైట్ చట్టాల ప్రకారం నేరమని హెచ్చరించింది. ఇప్పటికే పలు లింకులను తొలగించినట్లు తెలుస్తోంది.అదే సమయంలో, ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ విషయంలో కూడా ఆలస్యం జరుగుతోంది. మొదట సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం, సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. ప్రస్తుతం రివైజింగ్ కమిటీ పరిశీలనకు వెళ్లిన ఈ సినిమా క్లియరెన్స్ ఎప్పుడు వస్తుందన్నది ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఈ ఘటనపై కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ.. పైరసీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సినిమాలను థియేటర్లలోనే చూడాలని, పైరసీని ప్రోత్సహించవద్దని అభిమానులను కోరుతున్నారు.