Jana Nayagan | కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయకన్’ విడుదలకు ముందే లీక్ అవ్వడం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పెను సంచలనాలను సృష్టిస్తుంది. రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న విజయ్‌కి ఇది చివరి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన సుమారు 5 నిమిషాల కీలక సన్నివేశాలు, టైటిల్ కార్డ్స్ మరియు క్లైమాక్స్ భాగాలు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం చిత్ర యూనిట్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్ని చోట్ల పూర్తి HD వెర్షన్ కూడా లీక్ అయిందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతున్నాయి. ఈ దారుణమైన పైరసీ చర్యను సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఖండిస్తున్నారు.
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఒక సినిమా వెనుక వేలాది మంది కష్టం ఉంటుందని, ఇలాంటి చర్యలు పరిశ్రమను నాశనం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హీరో కార్తీ కూడా దీనిపై ఘాటుగా స్పందిస్తూ, పైరసీ అనేది కేవలం దొంగతనం మాత్రమే కాదు, ఒక కళాకారుడి కష్టాన్ని మరియు కలలను చంపడమేనని పేర్కొన్నారు. అభిమానులు ఎవరూ ఈ లీకైన వీడియోలను చూడవద్దని, షేర్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు దర్శకుడు పా రంజిత్ డిజిటల్ సెక్యూరిటీలోని లోపాలను వేలెత్తి చూపుతూ, పైరసీ వెబ్సైట్లపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. చిరంజీవి, కమల్ హాసన్, శివకార్తికేయన్ వంటి అగ్ర తారలు కూడా ‘జన నాయకన్’ టీమ్‌కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఇప్పటికే రంగంలోకి దిగి, లీక్ చేసిన వారిపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.