Jana Nayagan | తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ చరిత్ర సృష్టించింది. డిసెంబర్ 27న మలేసియాలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీగా తరలివచ్చారు. సుమారు 85 వేల మందికి పైగా ఫ్యాన్స్, సెలబ్రిటీలు ఈ ఈవెంట్లో పాల్గొనడంతో ఇది మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. విజయ్ హీరోగా నటిస్తున్న చివరి చిత్రంగా ‘జన నాయగన్’ను ప్రకటించడంతో ఈ ఆడియో లాంచ్‌కు అపూర్వమైన క్రేజ్ ఏర్పడింది. అదే కారణంగా మేకర్స్ మలేసియాలో ఈ భారీ ఈవెంట్‌ను నిర్వహించగా, వేలాదిమంది అభిమానులతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది.
ఆడియో లాంచ్ సందర్భంగా విజయ్ స్టేజ్‌పై అభిమానులతో మాట్లాడడమే కాకుండా, ‘దళపతి కచేరి’ పాటకు డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. ఆయన ఎనర్జీ, స్టేజ్ ప్రెజెన్స్ మరోసారి అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. ఇక ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తన అందాలతో అలరించింది. కోలీవుడ్‌లో దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాట మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు అపారమైన అభిమానగణం ఉంది. సినిమాల పరంగా ఆయన ఇమేజ్ ఎప్పటికీ తగ్గని స్థాయిలో కొనసాగుతుండగా, అలాంటి విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
ఇప్పటికే TVK (తమిళగ వేట్రి కళగం) పేరుతో తన రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్, ప్రజా సమావేశాలు, రాజకీయ కార్యక్రమాలతో చురుకుగా ముందుకు సాగుతున్నారు. రాబోయే మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లోనే కొనసాగి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో ఆయన అడుగులు వేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘జన నాయగన్’ చిత్రం విజయ్ సినీ కెరీర్‌కు చివరి సినిమాగా నిలవనుండటం అభిమానులకు భావోద్వేగ క్షణంగా మారింది.