Sachin Chandwade | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్తారా-2 హిందీ వెబ్ సిరీస్‌లో కనిపించి అందరి ప్రశంసలు అందుకున్న మరాఠీ నటుడు సచిన్ చంద్వాడే (25) ఆత్మహత్య ఫిల్మ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. యువ నటుడు ఈ నెల 23న జల్గావ్లోని పరోలాలోని తన నివాసంలో ఉరి వేసుకున్నాడు. కుటుంబీకులు వెంటనే సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. మొదట ఉండిర్ఖేడ్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆయన పరిస్థితి మరింత దిగజారగా.. ధూలేలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా.. ఈ నెల 24న తెల్లవారు జామున 1.30 గంటలకు ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతి వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అందరూ షాక్ అయ్యారు.
జల్గావ్కు చెందిన సచిన్ నటనతో పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. పుణేలోని ఓ ఐటీ పార్క్‌లో పనిచేస్తూనే నటనను కొనసాగిస్తున్నాడు. బాల్యం నుంచి నటనపై మక్కువ పెంచుకున్నాడు. సచిన్ తన మరణానికి ముందు తన రాబోయే మరాఠీ చిత్రం అసుర్వాన్ మోషన్ పోస్టర్‌ను అభిమానులతో షేర్ చేశాడు. రామచంద్ర అంబత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా మొయిలీ, అనుజ్ ఠాకరే నటించారు. ఈ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది చివరలో విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంలో సచిన్ ప్రధాన పాత్రలో కనిపించాడు. సచిన్ నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ డ్రామా జమ్తారా-2లో నటించి అందరి ప్రశంసలు పొందాడు. ఇదిలా ఉండగా.. సచిన్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబం, అసుర్వాన్ నిర్మాతలు సచిన్ మరణంపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.