Jailer 2 |సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ చిత్రం 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో ఇప్పుడు జైలర్ 2ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్లో రజినీకాంత్‌తో పాటు ఎస్జే సూర్య, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖులు నటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
అయితే తాజాగా ‘జైలర్ 2’ షూటింగ్ స్పాట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని పనయూర్ ఆదిత్యరామ్ ఫిల్మ్ సిటీలో ప్యాచ్‌వర్క్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంటి సెట్లో ఫ్యాన్లు బిగించే పనిలో ఉన్న సమయంలో అనూహ్యంగా కరెంట్ షాక్ తగలడంతో సేలం జిల్లాకు చెందిన కార్తికేయన్ (28) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో షూటింగ్ స్పాట్లో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న కానత్తూర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక విచారణలో కరెంట్ లీకేజీ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. షూటింగ్ ప్రదేశంలో తగిన భద్రతా చర్యలు తీసుకున్నారా లేదా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ‘జైలర్ 2’ చిత్రీకరణ చెన్నై, గోవా, కేరళ ప్రాంతాల్లో పూర్తయినట్లు తెలుస్తోంది. కొన్ని అదనపు సన్నివేశాల కోసం గత రెండు వారాలుగా ఈ ఫిల్మ్ సిటీలో పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలచివేస్తోంది. ఇటీవలి కాలంలో తమిళ సినీ పరిశ్రమలో షూటింగ్ సమయంలో ప్రమాదాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన వెట్టువం షూటింగ్లో స్టంట్ మాస్టర్ మోహన్‌రాజ్ మరణించగా, కార్తీ నటిస్తున్న సర్ధార్ 2 షూటింగ్లో కూడా ఓ స్టంట్ ఆర్టిస్ట్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో షూటింగ్ స్పాట్లలో కార్మికులు, టెక్నీషియన్స్ భద్రతపై మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సినీ వర్గాలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.