‘జై హనుమాన్’లో హనుమంతుడిగా రిషబ్‌శెట్టి స్టిల్స్ విడుదలైన నాటినుంచి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లూ ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మాత్రమే జరిగింది. బౌండ్ స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. రిషబ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం షూటింగ్ మొదలుపెట్టేందుకు దర్శకుడు ప్రశాంత్‌వర్మ రెడీగా ఉన్నారు. ఎట్టకేలకు అందరి ఎదురు చూపులకూ తెరదించుతూ.. ఇన్నాళ్లు ‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్లో బిజీగా ఉన్న రిషబ్.. ఇక ‘జై హనుమాన్’ సెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నది. ఇదొక కల్పిత కథ అని, సంభ్రమాశ్చర్యాలకు లోను చేసేలా ఇందులోని కథ, కథనాలుంటాయని, హాలీవుడ్ ‘అవైంజర్స్’ చిత్రాన్ని తలపించేలా ఈ చిత్రం తెరకెక్కనున్నదని ఫిల్మ్‌నగర్ సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.