Jagadeka veerudu athiloka sundari | చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన అద్భుత చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసిన బోర్ అనేది రాదు. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఈ నెల 9 నాటికి 35 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 1990 మే 9న విడుదలైన ‘జగదేక వీరుడు అతిలోక సుందరిస చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్‌గా నిలిచిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మధ్యాహ్నం ఆటకే, కేవలం రూ. 6.50 విలువైన టికెట్‌ను బ్లాక్ మార్కెట్లో ఏకంగా రూ. 210కి కొనుగోలు చేశారట.
అప్పట్లో అంత రేటు పెట్టి ఆ సినిమా టిక్కెట్ బ్లాక్‌లో కొన్నారంటే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చిత్రంలో చిరంజీవి రాజు అనే టూరిస్ట్ గైడ్‌గా కనిపించగా, శ్రీదేవి ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చిన దేవకన్య ఇంద్రజ పాత్రలో కనిపించి ప్రేక్షకులని మైమరిపించేసింది. అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేశారు. చిత్రంలో ‘దినక్కుతా’ అనే పాట గురించి అశ్వనీదత్ మాట్లాడుతూ .. ‘ఈ పాటను షూట్ చేసే టైంకి చిరంజీవి 106 డిగ్రీల జ్వరంతో బాధ పడుతున్నట్టు తెలియజేశారు.
ప్రతి షాట్ బ్రేక్ సమయంలో, చిరంజీవి శరీరాన్ని ఐస్ ప్యాక్డ్ బట్టలతో చుట్టి చల్లపరిచే వాళ్లమని అన్నారు. శ్రీదేవి కాల్ షీట్లు మాకు చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నందున ఆయన ఆ పాట కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. ఆమె వేరే మూవీ షూటింగ్ కోసం ఒకటిన్నర నెలలు విదేశాలకి వెళాల్సి రావడం, రెండు రోజుల్లోనే ఒక సెట్లో షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండడం వలన చిరంజీవి అంత రిస్క్ చేసి షూటింగ్ చేశారు. షూటింగ్ తర్వాత చిరంజీవి గారిని వెంటనే విజయ ఆసుపత్రిలో చేర్పించాం. 15 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు అని అశ్వినీదత్ అన్నారు. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించారు.