జగదీష్ ఆమంచి నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మైథలాజికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. శ్రావణి శెట్టి కథానాయిక. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అతిథులుగా విచ్చేసిన నిర్మాత బెక్కెం వేణుగోపాల్, కె మ్యూజిక్ సీఈవో ప్రియాంక ఆడియోను లాంచ్ చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
జగదీష్ ఆమంచి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు, హత్యలు, కుట్రలకు చెందిన వార్తలే వినిపిస్తున్నాయి. ఆ పాయింట్లోనే ఈ సినిమా తీశాను. అందరినీ ఆలోచింపజేసే సినిమా ఇది’ అని తెలిపారు. ఇంకా శ్రీమల్లిక, శ్రావణి శెట్టి, ఆకాష్, సంగీత దర్శకుడు భవానీ రాకేష్, స్క్రీన్‌ప్లే రైటర్ శివ కుండ్రపు, డీవోపీ విష్ణురెడ్డి వంగా తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి రచన: హరి అల్లసాని, జగదీష్ ఆమంచి, నిర్మాణం: జగన్నాథ పిక్చర్స్.