Nandi Awards | కమెడియన్ రోహిణి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరియల్ నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రోహిణి.. జబర్దస్త్ కామెడీ షోతో అందరి ఫేవరేట్‌గా మారింది. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత దగ్గరైంది. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా మారిపోయిన రోహిణి.. సోషల్‌మీడియాలో రీసెంట్గా చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీ ప్రభుత్వంపైనే రోహిణి సెటైర్లు వేసిందని తెగ ప్రచారం జరుగుతోంది.
2014 సంవత్సరానికి సంబంధించిన నంది అవార్డులను 2018లో అప్పటి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ సమయంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లో తన నటనకు గానూ రోహిణిని బెస్ట్ టీవీ కమెడియన్ అవార్డు వరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆంధప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓ లెటర్‌ను కూడా రోహిణికి పంపించింది. తొందరలోనే నంది అవార్డుల వేడుక నిర్వహించి అవార్డుతో పాటు పది వేల నగదు బహుమతిని అందజేస్తామని లేఖలో పేర్కొంది. ఈ లెటర్‌నే తాజాగా జబర్దస్త్ రోహిణి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
నా ఫస్ట్ సీరియల్‌కు నంది అవార్డు వచ్చింది. కానీ ఇప్పటివరకు నాకు అది అందలేదు. నా కెరీర్లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ఒక మంచి జ్ఞాపకం. గతంలో నేను సాధించిన దాన్ని కేవలం ఇలా షేర్ చేయాలని అనుకుంటున్నా అని పోస్టు చేసింది. ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారింది. చాలామంది నంది అవార్డు వరించింనందుకు రోహిణిని ప్రశంసిస్తున్నారు. అయితే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రోహిణి ఈ పోస్టు చేయడంతో దీన్ని చాలామంది నెటిజన్లు రాజకీయంగానే చూస్తున్నారు. అప్పుడెప్పుడో అవార్డులు ప్రకటించి ఇవ్వకపోతే.. ఇప్పుడు ఎందుకు పోస్టు చేస్తున్నావ్ అని ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్ టైమ్ కదా అని గుర్తుకువస్తాయి అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.