Itlu Mee Yedava | యువ నటుడు త్రినాథ్ కఠారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. సంజీవని ప్రొడక్షన్స్ పతాకంపై బళ్లారి శంకర్ నిర్మించిన ఈ సినిమాలో సాహితీ అవాంచ కథానాయికగా నటించింది. నేడు, నవంబర్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ముందు రోజు (నవంబర్ 20) ప్రీమియర్లు వేశారు.
కథ
ఆరేళ్లుగా పీజీ చదువుతూ ఆవారాగా తిరిగే శ్రీను (త్రినాథ్ కఠారి), కాలేజీలో చేరిన మనస్విని (సాహితీ అవాంచ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం తన ప్రవర్తనను మార్చుకుని మనస్వినిని ఒప్పిస్తాడు. తమ కొడుకులో వచ్చిన మార్పు చూసి సంతోషించిన శ్రీను తండ్రి (గోపరాజు రమణ) పెళ్లి సంబంధం కోసం మనస్విని తండ్రి (దేవి ప్రసాద్) దగ్గరకు వెళ్తాడు. అయితే, శ్రీను ఎదవ ప్రవర్తనను గుర్తుచేసుకున్న మనస్విని తండ్రి సంబంధాన్ని తిరస్కరించడంతో సమస్య మొదలవుతుంది. ఈ ఇష్యూ ఓ డాక్టర్ (తనికెళ్ళ భరణి గెస్ట్ అప్పీరెన్స్) వద్దకు వెళ్లగా, ఆయన ఒక ఛాలెంజ్ విసురుతారు: శ్రీను 30 రోజులు మనస్విని తండ్రితోనే ఉండాలి. ఆ 30 రోజుల్లో శ్రీను నిజంగా ‘ఎదవ’ అని తేలితే, ఆ ప్రేమను వదులుకోవాలి. ఈ ఛాలెంజ్‌ను శ్రీను, మనస్విని, ఆమె తండ్రి అంగీకరిస్తారు. 30 రోజుల్లో శ్రీను మంచోడని నిరూపించుకున్నాడా? వారి ప్రేమ ఏమైంది? అనేది తెరపై చూడాలి.
విశ్లేషణ:
దర్శకుడు త్రినాథ్ కఠారి.. గతంలో వచ్చిన ‘బొమ్మరిల్లు’ కాన్సెప్ట్‌ను రివర్స్ చేసి, ఇక్కడ 30 రోజుల ఛాలెంజ్‌ను హీరోపై పెట్టడం ఆసక్తికరంగా ఉంది. ఫస్ట్ హాఫ్: ఈ భాగం రొటీన్ కాలేజీ మరియు లవ్ సీన్స్‌తో నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అతికించినట్టు అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్ దగ్గర 30 రోజుల ఛాలెంజ్ పెట్టడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్: ఈ భాగం ప్రధానంగా హీరో-హీరోయిన్ తండ్రి మధ్య నడుస్తుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా, ఎమోషనల్‌గా బాగా రాసుకున్నారు. కథకు భిన్నంగా క్లైమాక్స్ చక్కగా ఉండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. కామెడీ సీన్స్ పర్వాలేదు. సినిమా టైటిల్‌కు తగ్గట్టు హీరో పాత్ర చివరి వరకు ‘ఎదవ’ అనే అనిపించుకోవడం ద్వారా, ‘ఎదవ అని పిలిపించుకునేవాళ్లంతా ఎదవలు కారు’ అనే సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
నటీనటుల పనితీరు:
త్రినాథ్ కఠారి హీరోగా, దర్శకుడిగా బాధ్యతలను బాగానే నిర్వర్తించాడు. సాహితీ అవాంచ క్యూట్‌గా, హాఫ్ శారీలలో కనిపించి ఆకట్టుకుంది. అందంతో పాటు నటనతో కూడా మెప్పించింది. తండ్రి పాత్రల్లో గోపరాజు రమణ, దేవి ప్రసాద్ తమ పాత్రల్లో ఒదిగిపోయి చక్కగా నటించారు. డాక్టర్ పాత్రలో తనికెళ్ళ భరణి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బీచ్ సీన్స్, పాటల్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఆయన పాత సినిమాల్లోని తరహాలో పాటలు, నేపథ్య సంగీతం ఉండటంతో పాత ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిగా ‘ఇట్లు మీ ఎదవ’.. బొమ్మరిల్లు కాన్సెప్ట్‌ను రివర్స్ చేసి తీసిన లవ్ స్టోరీ. కొత్తగా సినిమాను కోరుకునే వారు ఈ వీకెండ్ ఈ టైమ్ పాస్ సినిమాను చూడవచ్చు.