Sai Kumar | మయసభ.. టాలీవుడ్లో ఇప్పుడు అందరి చూపు ఈ వెబ్ సీరిస్పైనే ఉంది. ఇద్దరు స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇది కల్పిత కథేనని డైరెక్టర్ దేవా కట్టా చెప్పినప్పటికీ.. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాల ఆధారంగానే తెరకెక్కిందనే ప్రచారం ఉంది. పైగా ఈ వెబ్ సిరీస్‌లోని ప్రధాన పాత్రలు కూడా వాళ్ల ఆహార్యంలోనే కనిపించారు. తాజాగా రిలీజైన టీజర్‌తో ఈ వెబ్ సిరీస్‌పై భారీ హైప్ వచ్చేసింది. ఈ క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ రోల్ ఎవరు చేసి ఉంటారనే సస్పెన్స్ ఒకటి నెలకొంది. అయితే, తాజా పరిణామాలను బట్టి ఆ క్యారెక్టర్ డైలాగ్ కింగ్ సాయికుమార్ చేసినట్లు తెలుస్తోంది.
సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా మయసభ వెబ్ సిరీస్ నుంచి డైరెక్టర్ దేవా కట్టా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. “ప్రస్థానం”, “ఆటోనగర్ సూర్య” తర్వాత #Mayasabha లో సాయికుమార్‌తో మూడోసారి పనిచేయడం చాలా ఎంజాయ్ చేశానని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆనందంగా ఉంటూ.. తనకు నచ్చిన పాత్రలు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు సాయికుమార్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. అనంతరం మరో ట్వీట్ చేస్తూ.. ఇందులో మీరు ఏ పాత్ర పోషించారో కానీ.. తుక్కు రేగ్గొట్టారు.. తెలుగు ప్రేక్షకులు ఆగస్టు 7న మరోసారి మీ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారని చెప్పారు. దీన్నిబట్టి సాయికుమార్ సీనియర్ ఎన్టీఆర్ రోల్లోనే చేసి ఉంటారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే.. వచ్చే నెల ఏడో తారీఖు దాకా ఆగాల్సిందే!
ఇక్కడ మీరు ఏ పాత్ర పోషించారో కానీ, “తుక్కు రేగ్గొట్టారు”!!! తెలుగు ప్రేక్షకులు ఆగస్ట్ 7న మరోసారి మీ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు! #HBDSaikumar #MayasabhaOn7thAugust https://t.co/6MUuowWFfV
— deva katta (@devakatta) July 27, 2025
మయసభ చంద్రబాబు, వైఎస్ఆర్ జీవితం ఆధారంగానే తెరకెక్కిందని ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై అధికారికంగా మాత్రం ఎవరూ స్పందించలేదు. రెండు ప్రధాన పాత్రల పేర్లను కూడా కాకర్ల కృష్ణమనాయుడు, ఎంఎస్ రామిరెడ్డిగా పెట్టారు. కృష్ణమనాయుడిగా ఆది పినిశెట్టి, రామిరెడ్డిగా చైతన్య రావు నటించారు.