NTR | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జూలై 18న తారక్ కీలక ప్రకటన చేయనున్నారని, అభిమాన సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో తాజాగా ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చింది.
ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో, అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. గతంలో 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం, అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడం వంటి పరిణామాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటికీ ఎన్టీఆర్ టీమ్ ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనతో చెక్ పడింది.
టీమ్ విడుదల చేసిన ప్రకటనలో, జూలై 18న రాజకీయ ప్రకటన ఉంటుందంటూ ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఆ రోజు నిర్వహించబోయే కార్యక్రమం “ఊరు వాడ” పేరుతో ఇప్పటికే ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించిన ఒక సామాజిక కార్యక్రమమని వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా “ఊరు వాడ” కార్యక్రమం లక్ష్యం, ఉద్దేశ్యం, విజన్‌ను ప్రజలకు పరిచయం చేయనున్నట్లు పేర్కొంది. దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలిపింది. “ఊరు వాడ” కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం, పూర్తి కార్యాచరణ వివరాలను త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడిస్తామని టీమ్ పేర్కొంది.
అలాగే మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ఖాతాలు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఎలాంటి వార్తనైనా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే ప్రచురించాలని కోరుతూ, తప్పుడు ప్రచారం వల్ల అభిమానుల్లో అనవసర గందరగోళం ఏర్పడుతుందని తెలిపింది. ఎన్టీఆర్ అభిమానులు, మీడియా ప్రతినిధులు ఎప్పటికప్పుడు అందిస్తున్న ప్రేమ, ఆదరణ, సహకారానికి టీమ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇకపై కూడా అధికారిక సమాచారం కోసం ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే ఫాలో కావాలని సూచించింది.