Irumudi | మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా, తాజాగా చిత్ర బృందం అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. చిత్ర యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘ఇరుముడి’ చిత్రం 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్న ఈ సినిమాను రెండు పరిశ్రమల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు.
తెలుగులో ‘ఇరుముడి’ పేరుతో విడుదల కానున్న ఈ చిత్రం, తమిళంలో ‘ఇరుముడికట్టు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ గురించి గతంలో రవితేజ మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి కథే ‘ఇరుముడి’. ఈ ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త అనుభవం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను” అని రవితేజ పేర్కొన్నారు.
ఈ చిత్రంలో ప్రముఖ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలనటి బేబీ నకాస్త్ర కీలక పాత్రలో కనిపించనుంది. సినిమాలో ఆమె రవితేజ కుమార్తె పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న ఈ పాత్ర కథలో కీలకంగా ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ‘ఇరుముడి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సంగీత సంచలనం జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరచనున్న పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రవితేజ కెరీర్లో మరో విభిన్నమైన చిత్రంగా ‘ఇరుముడి’ నిలుస్తుందనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. శివ నిర్వాణ భావోద్వేగ కథన శైలి, రవితేజ ఎనర్జీ, బలమైన కథాంశం కలగలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 21న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.