జీవితం పట్ల స్పష్టమైన దృక్పథంతో ఉంటారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. అపజయాలకు ఏ మాత్రం బెదరరు. ప్రతి విషయంలో సానుకూలంగా ఆలోచించడం ఆయన బలంగా చెబుతారు. తాజా సోషల్‌మీడియా ఇంటర్వ్యూలో ఆయన ఇదే వైఖరిని కనబరిచారు. ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన విజయ్ దేవరకొండ వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘ఓ మంచి హిట్ ఇవ్వన్నా’ అని ఓ అభిమాని అడగ్గా..‘హిట్ ఒక్కటే పెండింగ్ రా..త్వరలో కొట్టేద్దాం’ అని సమాధానమిచ్చాడు. దీంతో తన తాజా చిత్రం ‘ఖుషి’ విజయంపై విజయ్ దేవరకొండ పూర్తి విశ్వాసంతో ఉన్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమంత కథానాయికగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ అరవై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సమంత అనారోగ్యం నుంచి కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌ను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.