బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని జంటగా నటించిన సినిమా ‘నేను స్టూడెంట్ సార్’. ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జూన్ 2న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు తెలిపారు నిర్మాత సతీష్ వర్మ. ఆయన మాట్లాడుతూ…‘మా సంస్థకు ‘నాంది’ సినిమా ఇచ్చిన విజయాన్ని, పేరును కొనసాగించే చిత్రమవుతుంది. ఈ కథలో కొత్త అంశాలున్నాయి. మంచి థ్రిల్లర్ జానర్లో సినిమా సాగుతుంటుంది. బెల్లంకొండ గణేష్ ఈ కథకు సరిగ్గా సరిపోయారు. ఆయన అమాయకత్వం, సహజంగా ప్రవర్తించే విధానం ఈ పాత్రలోనూ ఉన్నాయి. ప్రతి స్టూడెంట్ ఐఫోన్ కొనుక్కోవాలని ప్రయత్నిస్తారు. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి సందర్భం వస్తుంది. కథలో మూడు ప్రధాన మలుపులు ఉంటాయి. ఆ ట్విస్ట్‌లు నచ్చే ఈ సినిమా అంగీకరించాను. కథను అందించిన కృష్ణ చైతన్య ప్రస్తుతం నితిన్‌తో సినిమా చేస్తున్నారు. అందుకే ఈ సినిమాకు కథ మాత్రం అందించాడు. దర్శకుడు రాఖీ తేజ దగ్గర సహాయకుడిగా పనిచేశారు. ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేసిన వారికి సినిమా ఎలా ఆకట్టుకునేలా తెరకెక్కించాలో అవగాహన ఉంటుంది. ఇందులో సందేశం ఉండదు. స్టూడెంట్ లైఫ్ చూపిస్తున్నాం. ఇటీవల మీడియాలో వచ్చిన రెండు సంఘటనలు స్ఫూర్తిగా తీసుకున్నాం. విద్యార్థుల ద్వారానే ఆ ఘటనల నేపథ్యం అర్థమవుతుంది. మహతి స్వరసాగర్ ఆకట్టుకునే స్వరాలు ఇచ్చారు. నేపథ్య సంగీతం ఆకర్షణ అవుతుంది. సముద్రఖని ఓ కీలక పాత్రను పోషించారు. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు తెచ్చేందుకు ప్రయత్నించే ఓ క్రీడాకారుడి పాత్ర నేపథ్యంతో ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పారు.