Indian government | భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత ప్రభుత్వం మీడియా సంస్థలకు ఒక ముఖ్యమైన సూచన చేసింది. టీవీ ప్రసారాల్లో ఎయిర్ రైడ్ (వైమానిక దాడి) సైరన్ల శబ్దాలను ఉపయోగించవద్దని కోరింది. పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్లను (Air Raid Sirens) వార్తా కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని.. సైరన్లను ఉపయోగించి ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు తలెత్తకుండా చూడాలని మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచించింది.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ మరియు హోమ్ గార్డ్స్ ఈ మేరకు ఒక సలహా జారీ చేసింది. 1968 నాటి సివిల్ డిఫెన్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు మినహా ఇతర వార్తా ప్రసారాలలో ఈ సైరన్ శబ్దాలను వాడవద్దని అన్ని మీడియా ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
సాధారణంగా వార్తా కార్యక్రమాల్లో ఇలాంటి సైరన్ శబ్దాలను ఉపయోగిస్తే, ప్రజలు వాటిని అలవాటుగా తీసుకునే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా నిజమైన వైమానిక దాడి జరిగినప్పుడు కూడా అది సాధారణ విషయమని భావించి అప్రమత్తంగా ఉండకపోవచ్చని హెచ్చరించింది.
ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సూచనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొన్ని వార్తా ఛానళ్లు ఉద్రిక్తతను మరింతగా చూపించేందుకు తమ ప్రసారాల్లో ఇలాంటి భయానకమైన శబ్దాలను వాడుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ప్రజల భద్రత దృష్ట్యా మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కేవలం అవగాహన కార్యక్రమాల కోసమే సైరన్ శబ్దాలను ఉపయోగించాలని ప్రభుత్వం కోరింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడాలని కూడా సూచించింది.