Remembering the Stars – Indian Celebrities We Lost In 2024 | సంవత్సరం భారతీయ సినీ ఇండస్ట్రీలో పలు విషాదాలు నింపిన విషయం తెలిసిందే. సంగీత దిగ్గజం జాకీర్ హుస్సేన్‌తో పాటు, ప్రజా గాయకుడు గద్దర్, దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ వంటి ప్రముఖులు కాలం చేశారు. అయితే ఈ ఏడాది మరణించిన సినీ ప్రముఖులు ఎవరెవరో అనేది ఒకసారి చూసుకుంటే.!
శ్యామ్ బెనెగల్
Shyam benegal
దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కూడా.. ఈ ఏడాది మరణించిన ప్రముఖులలో ఒకడు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న 90 సంవత్సరాల శ్యామ్ బెనెగల్ డిసెంబర్ 23న సాయంత్రం ముంబైలోని వోడ్‌హార్డ్ దవాఖానలో తుది శ్వాస విడిచారు. అంకుర్, భూమిక, జునూన్, కలియుగ్, ఆరోహన్, త్రికాల్, సుస్మాన్, అంతర్నాద్, మండి, మంథన్ తదితర అనేక అవార్డు చిత్రాలకు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు.
1978లో వాణిశ్రీ, అనంతనాగ్‌లతో ఆయన తీసిన ఏకైక తెలుగు చిత్రం అనుగ్రహం 1979 బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు నోచుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డిసెంబర్ 14న ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులతో కలసి తన 90వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డు, 1991లో పద్మ భూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది. ఆయన దర్శకత్వం వహించిన విజయవంతమైన చిత్రాలలో మంథన్, జుబేదా, సర్దారీ బేగం కూడా ఉన్నాయి.
రామోజీరావు
Ramoji Rao
ఈనాడు సంస్థల అధినేత, మీడియా మొగల్ రామోజీరావు (Ramoji Rao) మరణించారు. జూన్ 07న రాత్రి రామోజీ రావు అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున జూన్ 08న 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.
1936, నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. చిననాటినుంచే విలక్షణ, సృజనాత్మకత కలిగిన ఆయన.. ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974, ఆగస్టు 10న విశాఖపట్టణంలో ఈనాడును ప్రారంభించారు. అనంతరం సితార సినీ పత్రిక, ఈటీవీ చానళ్లను కూడా తీసుకొచ్చి మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫిల్మ్ సిటీని నిర్మించారు. సినిమా మొత్తాన్ని అక్కడే షూటింగ్ చేసుకునేలా సకల వసతులు కల్పించారు.
జాకీర్ హుస్సేన్
Zakir Hussain
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) ఈ నెలలోనే కన్నుమూశారు. హృద్రోగ సంబంధ సమస్యలతో రెండు వారాలుగా ఆయన అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే డిసెంబర్ 15న అతడి పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చగా తుదిశ్వాస విడిచాడు. భారత శాస్త్రీయ సంగీతంలో జాకీర్ తనదైన ముద్ర వేశారు. తండ్రి వద్దనే సంగీతాన్ని అభ్యసించి ఏడేండ్ల వయసులోనే ఆయన కచేరీలలో తబలా వాయించే వారు. ముంబైలో గ్రాడ్యుయేషన్, జాకీర్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టోరల్ డిగ్రీని పూర్తి చేశారు.
ఆరు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో హుస్సేన్ ప్రతిష్టాత్మకమైన ఐదు గ్రామీ అవార్డులు గెల్చుకున్నారు. పలు భారత, అంతర్జాతీయ కళాకారులతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. జాకీర్ హుస్సేన్ 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందారు. 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌కు ఆహ్వానం పొందిన తొలి భారతీయ సంగీతకారుడు హుస్సేనే. ఆయన సేవలకు భారత ప్రభుత్వం1988లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్, 2023లో పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది.
ప్రజా గాయకుడు గద్దర్
Gaddar
ప్రజా గాయకుడు, రచయిత, యుద్ధనౌక గద్దర్(74) ఈ ఏడాది ఆగస్టులో కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఆగస్టు 6 న తుదిశ్వాస విడిచారు. ప్రజా గాయకుడిగా, రచయితగా, యుద్ధనౌకగా అందరికీ సుపరిచితమైన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ప్రాణం పోసిన యోధుడు గద్దర్. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ ‘అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద.. నడుస్తున్న కాలమా’ పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు.
బలగం మొగిలయ్య
Balagam Mogilaiah
బలగం సినిమాలో తన పాట ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజ ల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న జానపద కళాకారుడు పస్తం మొగిలయ్య (60) ఈ నెలలోనే కన్నుమూశారు. బేడ బుడగ జంగాలకు చెందిన ఈయన తెలంగాణ ప్రాంతంలో శారద కథల ద్వారా తన పాటలతో అలరించారు. కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె, సంబంధిత వ్యాధులతో బాధపడుతూ వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 19న తెల్లవారుజామున మృతి చెందారు. బలగం సినిమాలో క్లెమాక్స్ పాటలో ‘తోడుగా మాతోడుండి.. నీడల మాతో నడిచి’ అనే పాట ద్వారా కుటుంబంలో ఉన్న అనుబంధాలను ప్రతిబింబింపజేశారు.
ఉస్తాద్ రషీద్ ఖాన్
Ustad Rashid Khan
భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ రషీద్ ఖాన్ (55) ఈ ఏడాది కన్నుమూశారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన జనవరి 09న తుదిశ్వాస విడిచారు. ఉస్తాద్ రషీద్ ఖాన్ రాంపూర్-సహస్వాన్ ఘరానాకు చెందిన శాస్త్రీయ గాయకుడు. ఘరానా వ్యవస్థాపకుడు ఇనాయత్ హుస్సేన్ ఖాన్ మునిమనవడు. ఆయనకు 2006లో పద్మశ్రీతో పాటు సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా లభించింది.
రితురాజ్ సింగ్
Rituraj Singh
ప్రముఖ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ ఈ ఏడాది గుండెపోటుతో ఫిబ్రవరి 20న మరణించారు. ప్యాంక్రియాస్ (క్లోమం), గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న రితురాజ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి వచ్చారు. అయితే ఆస్పత్రి నుంచి వచ్చిన అనంతరం అతడికి గుండెపోటు రాగా అక్కడిక్కడే మరణించారు. టీవీ సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆయన పలు ‘బద్రినాథ్ కీ దుల్హనియా’, ‘యారియాన్ 2’ వంటి పలు బాలీవుడ్ సినిమాలలో నటించాడు. బాలీవుడ్ బాద్షా ఫారుఖ్ ఖాన్‌కు క్లాస్ మేట్ రితురాజ్. షారుఖ్ కారణంగానే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని పలు ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
పంకజ్ ఉదాస్
Pankaj Udhas
ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులలో ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ (72) ఒకరు. భారతీయ సంగీత ప్రపంచంలో గజల్, నేపథ్య గాయకుడిగా పంకజ్ (Pankaj Udhas) ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. ముఖ్యంగా హిందీలో ఆయన పాడిన పాటలు అజరామరం. 1980లో ‘ఆహత్’ అనే గజల్ ఆల్బమ్ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచారు. పంకజ్ ఉదాస్‌ను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
‘దంగల్’ నటి సుహానీ భట్నాగర్
Suhani Bhatnagar
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ ‘దంగల్’ నటించిన బాలనటి సుహానీ భట్నాగర్ (Suhani Bhatnagar) ఈ ఏడాది కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా డెర్మాటోమియోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సుహానీ ఫిబ్రవరి 19న తుదిశ్వాస విడిచింది. మరోవైపు సుహానీ మృతిపై ఆమీర్‌ఖాన్ కూడా సంతాపం ప్రకటించాడు. డెర్మాటోమయోసిటిస్ అనేది వాపు మరియు చర్మంపై దద్దుర్లు కలిగించే అరుదైన వ్యాధి. ఇది కండరాల వాపుకు దారితీయడంతో పాటు ప్రాణలు కోల్పోయే అవకాశం ఉంది.
జానపద గాయని శారదా సిన్హా
Saradha Sinha
ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా (72) కన్నుమూశారు. మైలోమా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు నవంబర్ 05న తుదిశ్వాస విడిచింది. ‘కార్తీక్ మాస్ ఇజోరియా’, కోయల్ బిన్’ వంటి జానపద పాటలతో ఆమె పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఇక బాలీవుడ్లో కూడా హమ్ ఆప్కే హై కౌన్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్ వంటి చిత్రాలలో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1991లో పద్మశ్రీ, 2018లో పద్మ భూషణ్‌లతో సత్కరించింది.
దర్శకుడు సూర్యకిరణ్
Surya Kiran
తెలుగు దర్శకుడు సూర్యకిరణ్ ఈ ఏడాది మార్చి 11న జాండిస్‌తో కన్నుమూశారు. సూర్య కిరణ్ తెలుగులో 2003లో వచ్చిన ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదట మలయాళంలో కెరీర్‌ను ప్రారంభించిన సూర్య కిరణ్ తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాలను తెరకెక్కించారు. సత్యం, ధన 51 చిత్రాలతో సుమంత్‌ని మాస్ హీరోగా నిలబెట్టారు. దాంతో పాటు తనని తాను దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో హిట్ చిత్రాలు తీసినా ఆ తర్వాత.. అనుకున్నంతగా రాణించకపోవడంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లారు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్లో రెండో కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చాడు. 2005లో హీరోయిన్ కళ్యాణి పెళ్లి చేసుకున్నారు. కళ్యాణి సూర్య కిరణ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే 2016లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
తమిళ నటుడు డేనియల్
Daniel Balaji
తమిళ నటుడు డేనియల్ బాలాజీ (48) ఈ ఏడాది మార్చి 30న మరణించారు. అర్థరాత్రి ఛాతినొప్పి రావడంతో ఆయన్ని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. మార్గ మధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విలన్ పాత్రల ద్వారా ఆయన గుర్తింపును పొందారు. దక్షిణాదిలో దాదాపు 50కిపైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో వడ చెన్నై, కాక్క కాక్క, వేైట్టెయాడు విళయాడు, తెలుగులో సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు.
పవిత్రా జయరామ్
Pavitra Jayaram
త్రినయిని సీరియల్‌తో పాపులర్ అయిన కన్నడ నటి పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించింది.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి(బి) గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించింది. కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో పవిత్ర జయరాం బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, సహ నటుడు చంద్రకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే పవిత్ర చనిపోయిన కొన్నిరోజులకే సహ నటుడు చంద్రకాంత్ సుసైడ్ చేసుకొని చనిపోయాడు.