Deepika Padukone | ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఇటీవల ఆస్కార్ అవార్డులపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. 2023లో ఆస్కార్ అవార్డులకు హాజరై వార్తల్లో నిలిచిన దీపికా.. భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు దక్కకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇటీవల ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’, ‘మిస్సింగ్ లేడీస్’ అనే భారతీయ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పలు వేదికలపై ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రాలు ఆస్కార్ 2025 తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. ఈ చిత్రాలు భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.
దీపిక సోషల్ మీడియాలో ఆస్కార్ అవార్డులపై ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ‘మీకు ఏ ఆస్కార్ ప్రత్యేకమైంది?’ అని ప్రశ్నించగా.. అడ్రియన్ బ్రాడీకి అవార్డు దక్కడంపై సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ‘ది బ్రూటలిస్ట్’ అనే చిత్రానికి అడ్రియన్ రెండోసారి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. అంతకు ముందు 2003లో ‘ది పియానిస్ట్’ చిత్రానికి అవార్డును అందుకున్నాడు. మేకప్ సెషన్లో మాట్లాడుతూ అడ్రియన్ బ్రాడీకి ఆస్కార్ దక్కడంపై సంతోషంగా ఉన్నట్లు పేర్కొంది. భారతీయ చిత్రాలకు దక్కకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత్ చాలాసార్లు ఆస్కార్ అవార్డులను కోల్పోయిందని పేర్కొంది.
అవార్డుకు అర్హత ఉన్న అనేక సినిమాలు వచ్చాయని.. కానీ వాటన్నింటిని విస్మరించినట్లు పేర్కొంది. 2023లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ అవార్డు గెలిచిన సందర్భంలో భావోద్వేగానికి గురైనట్లు చెప్పింది. ఆ సమయంలో తాను కూడా ప్రేక్షకులతో కలిసి కూర్చున్నానని.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ ప్రకటించిన సమయంలోనే భావోద్వేగానికి గురయ్యానని.. తనకు ఇది ప్రత్యేకమైన క్షణాలు అని పేర్కొంది. ఆ చిత్రంలో తాను భాగం కాకపోయినా భారతీయురాలిగా ఈ విజయం గొప్పదని తెలిపింది. 2023 ఆస్కార్ అవార్డుల వేదికలో దీపిక ప్రజెంటర్‌గా వ్యవహరించింది. నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను దక్కించుకుంది. ఇక దీపికా పదుకొనే చివరగా ‘సింగం రిటర్న్స్‌లో కనిపించింది. మళ్లీ కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కనిపించనున్నది.