జీ5 : అక్టోబర్ 25
తారాగణం : సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వైవీ మహేంద్ర తదితరులు
దర్శకత్వం : ఎల్ నాగరాజన్
సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లకుండా ‘ఓటీటీ’కి ఓటెయ్యాలంటే.. కథలో పస ఉండాల్సిందే! సరికొత్త కాన్సెప్ట్‌తో కట్టిపడేయాల్సిందే! అందుకోసం థ్రిల్లర్ కథాంశానికి ఏదైనా అద్భుతాన్ని జోడించాల్సిందే! ‘ఐందం వేదం’లో అదే చేసి సక్సెస్ కొట్టాడు దర్శకుడు. ఇక్కడ థ్రిల్లర్ కథకు మైథాలాజీని జోడిస్తూ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. ‘ఐందం వేదం’ అంటే.. ఐదో వేదం! మనకు తెలిసిన వేదాలు.. నాలుగే! మరి.. ఈ ఐదో వేదం సంగతేంటి? తెలుసుకోవాలంటే.. కథలోకి వెళ్లాల్సిందే!
కోల్‌కతాలో ఉండే తెలుగమ్మాయి అనూ (సాయి ధన్సిక) ఓ స్వేచ్ఛా జీవి. తల్లి అస్థికలను గంగలో కలపడానికి కాశీకి వస్తుంది. అక్కడ ఆమెను ఒక స్వామీజీ కలుస్తాడు. పురాతన కాలంనాటి ఒక చిన్నపెట్టెను ఇచ్చి.. దానిని అయ్యంగారపురంలోని శివాలయ పూజారికి అందజేయమని కోరుతాడు. అనుకోని ప్రమాదం జరిగి.. ఆ స్వామీజీ ఆమె కళ్ల ముందే చనిపోతాడు. అనూ.. ఆ బాక్స్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోదాం అనుకుంటుంది. కానీ, ఊహించని విధంగా ఆ పెట్టె మళ్లీ ఆమె దగ్గరికే చేరుతుంది. తన కెరీర్‌కు సంబంధించిన విషయమై.. త్రివేండ్రం వెళ్దాం అనుకుంటుంది.
కానీ, తన ప్రమేయం లేకుండానే అయ్యంగారపురం చేరుకుంటుంది. శివాలయానికి వెళ్లి పూజారికి పెట్టెను ఇవ్వబోతే.. అతను దానిని తీసుకోడు. పూజారి కొడుక్కు ఆ పెట్టెను ఇచ్చేస్తుంది. ఇక ఆ ఊరు వదిలి వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ, అందుకోసం ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. అనూ.. అయ్యంగారపురంలోనే చిక్కుకుంటుంది. ఆమెకు ఎదురైన వింత సంఘటనల వెనకున్న పరమార్థం ఏమిటి? వేదాలకు – ఆ పెట్టెకు ఉన్న సంబంధం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానమే.. ఐందం వేదం!