ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందకముందే.. నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతున్నాడు ఇబ్రహీం అలీఖాన్. బాలీవుడ్లోకి అడుగుపెట్టకముందే.. సామాజిక మాధ్యమాల్లో ‘రైజింగ్ స్టార్’గా వెలుగొందుతున్నాడీ సైఫ్ అలీఖాన్ వారసుడు. తాజాగా, ఒక మూగ-చెవిటి వ్యక్తితో సైగల భాషలో సంభాషించి.. నెటిజన్ల మన్ననలు పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. అందరూ ఇబ్రహీంను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇబ్రహీం అలీఖాన్ పటౌడి.. బాలీవుడ్ స్టయిలిష్ట్ హీరో సైఫ్ అలీఖాన్-అమృతా సింగ్ దంపతుల కొడుకు. 2008లో వచ్చిన ‘తాషన్’ చిత్రంలో సైఫ్ చిన్ననాటి పాత్రతో బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. నెట్ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘నాదానియన్’తో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. తాజాగా, ఇబ్రహీం నటించిన ‘సర్జమీన్’ చిత్రం.. జియో హాట్స్టార్ వేదికగా విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ముంబయిలో ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన ఇబ్రహీంతో ఫొటో దిగడానికి ఒక అభిమాని ఆసక్తిచూపాడు.
ఈ సందర్భంగా తను ‘మూగ-చెవిటి’ అంటూ సైగల భాషలోనే ఇబ్రహీంతో మాట్లాడాడు. అతని సైగలకు స్పందించిన ఇబ్రహీం.. ‘ఐ లవ్ యూ’ అంటూ సంజ్ఞా భాషలోనే చెప్పాడు. అతని చేతిని అందుకొని.. గట్టిగా కౌగిలించుకున్నాడు. అభిమానితో ఫొటోలు దిగి.. ‘నువ్వు ఇంటికి క్షేమంగా వెళ్లి పడుకో..’ అంటూ సైగలతోనే చెప్పాడు. ఇలా.. ఇబ్రహీం, ఆ అభిమాని మధ్య జరిగిన ఈ సంజ్ఞల సంభాషణ.. ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దాన్ని చూసినవాళ్లంతా ఈ యంగ్హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇబ్రహీంపై తమ ప్రేమ, గౌరవం వందల రెట్లు పెరిగాయని, తాను నిజంగా ‘ఒక స్టార్’ అని నిరూపించుకున్నాడని నెటిజన్లంతా కొనియాడుతున్నారు. ‘సర్జమీన్’ హిట్ టాక్తో మంచి వ్యూస్ సాధిస్తుండగా.. ఇబ్రహీం మూడో సినిమా ‘డైలర్’ చిత్రీకరణలో ఉన్నది.