Ibomma | తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగిస్తూ పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన ప్రముఖ పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. విదేశాల్లో ఉంటూ పైరసీ సామ్రాజ్యాన్ని నడిపిన రవిని నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ రాగానే కూకట్‌పల్లిలోని ఆయన నివాసంలో సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో, నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) యాంటీ వీడియో పైరసీ సెల్ హెడ్ రామ్ వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 30న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ పరిశ్రమ పెద్దలు గతంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను కూడా కలిసి ఐబొమ్మపై ఫిర్యాదు చేశారు. అయితే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను పోలీసులు బ్లాక్ చేసినా రవి పట్టు వీడకుండా దాన్ని బప్పం టీవీగా పేరు మార్చి కొత్త సినిమాలను సైతం HD ప్రింట్లతో అప్లోడ్ చేస్తూ సవాలు విసిరారు. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ బహిరంగంగా సవాళ్లు కూడా విసరడం గమనార్హం.
ఇమ్మడి రవి గతంలో ER ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. ఐదేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాతే ఆయన పైరసీ రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. “సామాన్యులు అధిక టికెట్ రేట్ల కారణంగా థియేటర్‌కు వెళ్లలేక పోతున్నారు, అందుకే తాను ఐబొమ్మను ప్రారంభించాను” అని రవి గతంలో ఓ ప్రకటన చేశారు. ఈ పైరసీకి విదేశాల్లో ఉంటూనే స్థానికంగా కొందరి సహకారం తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు.
రవిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు… పైరసీకి సంబంధించిన మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.5 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రవిని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రవి హైదరాబాద్‌కు ఎందుకు వచ్చారు? ఈ పైరసీ వెనుక ఇంకెవరు ఉన్నారు? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.