‘ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ రేట్లు పెంచాలని అడిగాం. అది కూడా టికెట్‌పై 50 మాత్రమే. తెలంగాణలో ఇదివరకే టికెట్ ధరలు పెరిగి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదు. ఈ సినిమాకు రెండు రాష్ర్టాల్లో ఎలాంటి బెనిఫిట్ షోలు కూడా లేవు’ అన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. ఆయన సమర్పణలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘తండేల్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. బన్నీ వాసు నిర్మాత. ఈ సందర్భంగా గురువారం ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘సినిమాల విషయంలో లాభనష్టాలను మేమే భరించడం గీతా ఆర్ట్స్ పాలసీ.
ఈ చిత్రానికి మేము అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చయింది. అయినా సినిమా మీద పూర్తినమ్మకంతో సొంతంగా రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు. ఈ సినిమాలో చివరి అర్ధగంటలో భావోద్వేగాలు పతాక స్థాయిలో ఉంటాయని, అంచనాలకు మించి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుందని, ఈ పాలి యేట గురితప్పేలేదు..రేపొద్దున్న రాజులమ్మ జాతరే అని నాగచైతన్య పేర్కొన్నారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ ‘ఈ ప్రేమకథలోని భావోద్వేగాలు హృదయాన్ని కదిలిస్తాయి.ఒక మనిషి కోసం తొమ్మిది నెలల ఎదురుచూపులో ఎంతటి వేదన ఉంటుందో సాయిపల్లవి పాత్రను చూస్తే అర్థమవుతుంది. చైతూ, సాయిపల్లవి పోటాపోటీ నటనను ప్రదర్శించారు’ అన్నారు. ఈ సినిమాలో పాకిస్తాన్ సీక్వెన్స్ కోసం దర్శకుడు ఎంతో పరిశోధన చేశారని, విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని నిర్మాత బన్నీ వాసు తెలిపారు.