హైదరాబాద్‌లోని కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ సోమవారం మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంలో ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించారు. అందరికీ ఉచిత ప్రవేశం కల్పించిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో వివిధ జోనర్ల కొరియన్ చిత్రాలను ప్రదర్శించారు. అలాగే కొరియన్ సంస్కృతిని ప్రతిబింబించేలా కొన్ని స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రముఖ కొరియన్ దర్శకుడు, నిర్మాత యూ ఇన్-షిక్ అభిమానులతో ఇంటరాక్డ్ కావడం ప్రత్యేకాకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలుగుతో పాటు ఇండియన్ ఆడియెన్స్ కోసం తాము కంటెంట్‌ను క్రియేట్ చేస్తామన్నారు. కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ సురేష్ చుక్కపల్లి మాట్లాడుతూ ‘సంస్కృతిపరంగా ఇండియా, కొరియా మధ్య ఎన్నో సారూప్యతలు కనిపిస్తాయి. మనలాగే వాళ్లు కూడా కుటుంబానికి ప్రాధాన్యతనిస్తారు. పెద్దలకు గౌరవాన్నిస్తారు. ఇండియాలో కొరియన్ ఫిల్మ్స్‌కి లార్జెస్ట్ వ్యూవర్ షిప్ ఉంది. ఇండియన్-కొరియన్ భాగస్వామ్యంలో భవిష్యత్తులో అద్భుతమైన చిత్రాలు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు.