‘ఓ సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవహరించడం ఇదే మొదటిసారి. అలవాటు లేని కొత్త పాత్రలోకి కరణ్‌జోహార్ నన్ను తీసుకొచ్చారు’ అని అన్నారు దర్శకుడు రాజమౌళి. బాలీవుడ్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’కు దక్షిణాది భాషల్లో ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రణభీర్‌కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదలకానుంది. శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదలచేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ ‘మూడేళ్ల క్రితం ఈ సినిమా గురించి నాతో మాట్లాడటానికి దర్శకుడు అయాన్ హైదరాబాద్ వచ్చాడు. అతడితో ఇరవై నిమిషాలు మాట్లాడగానే నాకంటే పెద్ద సినిమా పిచ్చోడిలా అనిపించాడు. సినిమాపట్ల అతడికి ఉన్న నమ్మకం, ప్రేమ నన్ను ఆకట్టుకున్నాయి. ఓ బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాడని ఆ రోజే అర్థమైంది. శివ అనే యువకుడి కథ ఇది. సామాన్య యువకుడు తనలోని బలాలను క్రోడికరించుకుంటూ అసాధారణ శక్తిగా ఎలా ఎదిగాడన్నది ఈ చిత్ర ఇతివృత్తం. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ ఉంటుంది’ అని అన్నారు.
‘ఈ సినిమా దక్షిణాది భాషలకు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడం ఆనందంగా ఉంది.ఇప్పటివరకు ఎవరూ చూడని కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పంచే చిత్రమిది. ఈ కథ విని తొలుత ప్రోత్సహించిన వారిలో నాగార్జున ఒకరు. రణభీర్‌కపూర్, అలియా కెమిస్ట్రీ, నటన ఆకట్టుకుంటాయి. వారి మధ్య స్నేహానికి మించి ఉన్న బంధం సినిమాలోని ఎమోషన్స్ బలంగా పండటానికి ఉపకరించింది’ అని అయాన్ ముఖర్జీ తెలిపారు.
“బాహుబలి’ కోసం ప్రభాస్ ఎలా కష్టపడ్డాడో అదే తపన రణభీర్లో కనిపించింది దర్శకుడి ఆలోచనను నమ్మి ఈ సినిమా కోసం ఏడేళ్లుగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. తన కథలతో సినిమాల పరంగా ఉన్న భాషాపరమైన హద్దుల్ని రాజమౌళి చెరిపివేస్తున్నారు. ఆయన ప్రతి సినిమా నాకు ఇష్టమే. ‘బాహుబలి’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించే అవకాశం నాకు ఇవ్వమని ఆయన్ని బతిమాలాను. దేశంలోనే తొలి క్రాస్ ఓవర్ సినిమాగా ‘బాహుబలి’ ఖ్యాతి గడించింది. పాన్ ఇండియన్ సంస్కృతిని మొదలుపెట్టిన చిత్రంగా నిలిచింది. భాషాపరిమితులు చెరిపేస్తూ ఇండియన్ సినిమాను ఒకటిగా చేశారు రాజమౌళి. సినిమాల పట్ల నాగార్జునకు ఉన్న అంకితభావం, తపన, వ్యక్తిగతంగా ఆయనలోని మంచితనం ప్రతిసారి నన్ను ఆశ్చర్యపరుస్తుంటాయి’ అని కరణ్‌జోహార్ చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ ‘రాజమౌళిగారు సమర్పకుడిగా వ్యవహరించడానికి అంగీకరించడంతోనే సినిమా సత్తా ఏమిటో అందరికి అర్థమైపోయింది. బల్గేరియాలో జరిగిన తొలి షెడ్యూల్ ద్వారా ఈ సినిమాలో నేను అడుగుపెట్టా.
ఈ చిత్రంతో నా ప్రయాణం చిన్నదే అయినా ఎన్నో మంచి జ్ఞాపకాల్ని మిగిల్చింది. బాలీవుడ్ ‘బాహుబలి’గా ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకముంది. దక్షిణాది ప్రేక్షకులు సినిమాను ఎంతగా ప్రేమిస్తారో ఇటీవల విడుదలైన చిత్రాలు నిరూపించాయి. మంచి సినిమా ఏ భాషలో విడుదలైనా ఆదరిస్తుంటారు. ‘బ్రహ్మాస్త్ర’ ఆ జాబితాలో నిలుస్తుందని అనుకుంటున్నా’ అని తెలిపారు. ‘బ్రహ్మాస్త్ర’ నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. మంచి సినిమాగా చాలా కాలం పాటు అందరి హృదయాల్లో నిలిచిపోతుంది’ అని అలియాభట్ చెప్పింది. రణభీర్‌కపూర్ మాట్లాడుతూ ‘రాజమౌళికి నేను వీరాభిమానిని. అమితాబ్‌బచ్చన్, నాగార్జున వంటి దిగ్గజ నటులతో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.