Hina Khan | కష్ట సమయాల్లో ఇష్టమైనవారి ప్రేమను పొందడమే అసలైన లగ్జరీ.. అంటున్నది బుల్లితెర నటి హీనా ఖాన్! అందానికి తగ్గ అభినయంతో.. టీవీ స్టార్‌గా ఎదిగింది హీనా! జెట్ వేగంతో దూసుకెళ్తున్న ఆమె కెరీర్‌కు.. ‘క్యాన్సర్’ సడెన్ బ్రేకులు వేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే తాను బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడ్డట్టు చెప్పి.. అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఒక పక్క కీమోథెరపీ చేయించుకుంటూనే.. అడపాదడపా కెరీర్‌కు సంబంధించిన ఈవెంట్లలోనూ మెరుస్తున్నది.
ఇటీవలే.. గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-10 నటీనటుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నది. అయితే, ఇది తనకు ఏమాత్రం గర్వించదగ్గ విషయం కాదనీ.. అనారోగ్య పరిస్థితుల వల్ల ఇలా గూగుల్ మోస్ట్ సెర్చ్‌లో ఉండే పరిస్థితి ఎవరికీ రావొద్దని కోరుకుంటున్నట్టు ‘ఇన్‌స్టా’లో పోస్ట్ పెట్టింది.
తానున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో.. తన వర్క్, తన విజయాల గురించి అభిమానులు వెతికి ఉంటే బాగుండేదని రాసుకొచ్చింది కూడా! తాజాగా, తన క్యాన్సర్ చికిత్స ప్రయాణాన్ని.. అందులో ఎదురవుతున్న సవాళ్లనూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నది. కీమోథెరపీ వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలిసే ఫొటోను ఇన్‌స్టా పేజీలో షేర్ చేసింది.
ఈ ఫొటో చూసిన ఆమె అభిమానులు.. కంటతడి ఎమోజీలతో తమ మద్దతు తెలుపుతున్నారు. కఠినమైన సవాళ్లు ఎదురవుతున్నా.. సానుకూలంగా స్పందిస్తూ సాగుతున్న హీనా ఖాన్ ప్రయాణం.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నదని నెటిజన్లు కొనియాడుతున్నారు. ‘ఏ రిశ్తా క్యా కహ్లాతా హై’ ధారావాహికతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగింది హీనా ఖాన్. ఆ తర్వాత హిందీ బిగ్‌బాస్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.