హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ విద్యా సంవత్సరం నుంచి ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరి అని పేరొంటూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు ఈ ఏడాది 9, 10వ తరగతులకు మినహాయింపు ఇచ్చినందున ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాలు చేస్తూ పలు ప్రైవేటు పాఠశాలలు వేసిన పిటిషన్లలో సింగిల్ జడ్జి స్టే ఇచ్చారని గుర్తుచేసింది. తదుపరి విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఆరు వారాలకు వాయిదా వేసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జి, ఇతర జాతీయ బోర్డు పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరి చేస్తూ 2024 డిసెంబర్ 7, 19 తేదీల్లో ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చింది.
దీనిని హైదరాబాద్‌కు చెందిన ప్రమీలా పాఠక్ సవాల్ చేస్తూ ప్రజాహిత వ్యాజ్యం వేశారు. తొలుత 6వ తరగతికి తెలుగును తప్పనిసరి చేశారని, తర్వాత ఒకటో తరగతికి విస్తరించారని తెలిపారు. కొవిడ్, ఇతర కారణాల వల్ల అమలు కాలేదని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. తాజా ఉత్తర్వుల వల్ల ఈ సారి 8, 9వ తరగతులకు తెలుగు అమలు అవుతున్నదని తెలిపారు. ఎంతోమంది విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్పందిస్తూ.. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ, అన్ ఎయిడెడ్, పలు ప్రైవేటు పాఠశాలల్లో అమలు అవుతున్నదని తెలిపారు. 9, 10వ తరగతులకు ఇప్పటివరకు ప్రతి ఏడాది మినహాయింపు ఇస్తున్నట్టుగానే 2025-26 విద్యా సంవత్సరానికి కూడా ఇచ్చామని తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): జిల్లా మత్స్యకారుల సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్ల లేదా పర్సన్ ఇన్చార్జిల నియామకాలు తాము వెలువరించే తీర్పుకు లోబడి ఉంటాయని జస్టిస్ టీ మాధవీదేవి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా మత్స్యకారుల సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్ల లేదా పర్సన్ ఇన్చార్జిలను ప్రభుత్వం నేరుగా నియమించేలా గత సెప్టెంబర్ 3న జీవో 60 జారీచేసింది. దీనిని హనుమకొండ జిల్లా మత్స్యకారుల సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్ బుస్స మల్లేశం సహా పది మంది సవాలు చేశారు.
దీనిపై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది డీఎల్ పాండు వాదిస్తూ, జీవో ఏకపక్షంగా జారీ అయ్యిందని తెలిపారు. జీవోను రద్దు చేయాలని కోరారు. జిల్లాల పర్సన్ ఇన్చార్జిలుగా పిటిషనర్లను కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనల తర్వాత ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పశుసంవర్థక, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ ఎండీలకు నోటీసులు జారీచేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.