పాన్ ఇండియా ట్రెండ్ వల్ల కొన్నేళ్లుగా సినీ సమీకరణాలు మొత్తం మారిపోయాయి. ఒకప్పుడు ఏదో ఒక భాషకు పరిమితమైపోయిన కథానాయికలు ఇప్పుడు వివిధ భాషల్లో అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు.అయితే ఈ పాన్ ఇండియా ధోరణి సీనియర్ హీరోయిన్ల వేగానికి కాస్త బ్రేకులు వేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతంఅన్ని భాషల్లో నవ నాయికలదే జోరు.
ఈ నేపథ్యంలో ఒకప్పుడు అగ్ర కథానాయికలుగా వెలుగొందిన సమంత, కాజల్, తమన్నాతో పాటు పలువురు భామలు తెలుగు తెరకు విరామం ప్రకటించినట్లుగా అనిపిస్తున్నది. ఈ భామలందరూ కొత్త సినిమా ముచ్చట్లు ఎప్పుడు చెబుతారోనని వారి అభిమాన గణం ఆసక్తిగా ఎదరుచూస్తున్నది.
కథానాయిక సమంత స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరితో జతకట్టి భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. గత కొన్నేళ్లుగా ఈ భామకు అదృష్టం కలిసి రావడం లేదు. వ్యక్తిగత జీవితంలో తలెత్తిన ఒడుదొడుకులు, ఆరోగ్యపరమైన సమస్యల్ని ధైర్యంగా అధిగమించినప్పటికీ.. సినిమాల పరంగా మాత్రం సమంతకు బ్యాడ్‌టైమ్ ఇంకా కంటిన్యూ అవుతున్నది. ‘ఖుషీ’ (2023) తర్వాత సమంత పూర్తి స్థాయి నాయికగా తెలుగు సినిమా చేయలేదు. స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘శుభం’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిందంతే. ‘మా ఇంటి బంగారం’ పేరుతో సమంత కథానాయికగా నటిస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే! అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి గత కొంతకాలంగా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. దీంతో ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు.
కథల ఎంపికలో కొత్తదనాన్ని చూపిస్తూ పాత్రల పరంగా ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మలయాళీ భామ కీర్తి సురేష్. ‘మహానటి’తో జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆమె గత కొంతకాలంగా సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా ఉంటున్నది. ఈ ఏడాది ‘ఉప్పుకప్పురంబు’ పేరుతో తెలుగు ఓటీటీలో ఆమె చేసిన ప్రయోగం అంతగా మెప్పించలేకపోయింది. ‘భోళా శంకర్’ తర్వాత కీర్తి సురేష్ తెలుగు వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఈ సొగసరికి తమిళంలో భారీ సినిమాలే ఉన్నాయి. తెలుగులో మాత్రం మంచి కథల కోసం నిరీక్షిస్తూ కొంచెం బ్రేక్ తీసుకుందని అంటున్నారు.
ఇక తమన్నా, కాజల్ అగర్వాల్ గ్లామర్ నాయికలుగా దక్షిణాదిలో తిరుగులేని క్రేజ్ పొందారు. తెలుగులో సుదీర్ఘకాలం వారి ప్రాభవం కొనసాగింది. కొత్త భామల వెల్లువలో వీరికి అవకాశాలు బాగా తగ్గాయి. కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ తర్వాత టాలీవుడ్‌కు బ్రేక్ నిచ్చింది. మంచి సబ్జెక్ట్‌తో రీఎంట్రీ కోసం సిద్ధమవుతున్నది. తమన్నా ఇటీవలే మైథాలజికల్ మూవీ ‘ఓదెల-2’తో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ఈ సినిమాకు ఆశించిన విజయం దక్కలేదు. దీని తర్వాత ఇప్పటి వరకు తెలుగులో ఎలాంటి ప్రాజెక్ట్ సైన్ చేయలేదు.
కథానాయికల్లో సాయిపల్లవిది భిన్నమైన పంథా. దక్షిణాదిలో ఈ తమిళ సుందరికి అభిమానులు కూడా ఎక్కువే. ఆమె ఓ సినిమా అంగీకరించిందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని భావిస్తారు. రెమ్యునరేషన్స్ గురించే ఆలోచించే బాపతు కాదు. కథతోపాటు తన పాత్ర నచ్చితేనే సినిమాలకు అంగీకరిస్తుంది సాయిపల్లవి. ఇప్పుడీ భామ పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ప్రతిష్ఠాత్మక ‘రామాయణ’ చిత్రంలో రణబీర్‌కపూర్ సరసన సీత పాత్రలో నటిస్తున్నది. ‘తండేల్’ తర్వాత ఇప్పటివరకు తెలుగులో మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు సాయిపల్లవి. కొన్ని కథా చర్చలు జరిగినా అవి అంతగా నచ్చకపోవడంతో ఆమె తిరస్కరించిందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది.
మంగళూరు భామ పూజాహెగ్డే తన కెరీర్లోనే బ్యాడ్ఫేజ్ను ఎదుర్కొంటున్నది. భారీ సినిమాల్లో ఆఫర్లయితే వస్తున్నాయి కానీ.. అవి కాస్తా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతుండటంతో ఈ అమ్మడికి విజయాలు కరువయ్యాయి. ‘ఆచార్య’ తర్వాత పూజాహెగ్డే తెలుగు తెరపై కనిపించలేదు. తమిళంలో మాత్రం ‘జననాయగన్’, ‘కాంచన-4’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నది. తెలుగులో పూజ రీఎంట్రీ ఎప్పుడని అభిమానుల్లో ఆసక్తినెలకొంది. తెలుగులో భారీ సినిమాల్లో నటించిన రకుల్‌ప్రీత్‌సింగ్ సైతం ఇప్పుడు రేసులో వెనకబడింది. ‘కొండపొలం’ తర్వాత ఆమె తెలుగు తెరపై మళ్లీ కనిపించలేదు.
…? సినిమా డెస్క్