Heroine | నిత్యా మీనన్ ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ల విషయంలో సాధారణంగా కీలకంగా భావించే “హైట్”, “జీరో సైజ్” వంటి ప్రమాణాలను పక్కన పెట్టి, మంచి నటనతో స్టార్ స్టేటస్ పొందగలమని నిరూపించింది నిత్యా. ప్రస్తుతం మాత్రం నిత్యా తెలుగు సినిమాలకు కొంత దూరంగా ఉంది. ఆమె ఇప్పుడు చాలా సెలెక్టివ్‌గా ప్రాజెక్ట్స్ ఎంపిక చేసుకుంటుంది. ప్రధానంగా తమిళం, మలయాళం సినిమాలకే ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా విజయ్ సేతుపతితో కలిసి నటించిన తమిళ చిత్రం ‘సార్ మేడమ్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిత్యా మీనన్ ప్రేమ, పెళ్లి గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. గతంలో ప్రేమ గురించి ఆలోచించానని, అప్పట్లో సోల్ మేట్ అవసరమేమోనని భావించానని పేర్కొంది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మారిందని, జీవితాన్ని వేరే కోణంలో చూసేలా మారిపోయిందని చెప్పింది. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని, అది జరిగినా, జరగకపోయినా జీవితం మీద ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా పెళ్లి చేసుకోలేదని, ఉదాహరణగా చెప్పింది. కొన్నిసార్లు తోడు లేకపోతే ఒంటరితనం అనిపించొచ్చుకాని, స్వేచ్ఛగా జీవించడంలో ఆనందం ఎక్కువగా ఉంటుందని నిత్యా అభిప్రాయపడింది.
నిత్యా కామెంట్స్ చూస్తుంటే ఆమె గతంలో ప్రేమలో ఉన్నట్టు, ఆ ప్రేమ విఫలమైనట్టు తెలుస్తోంది. ఒక దశలో ఆమె ఓ నటుడితో ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. కానీ ఆ తరువాత ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఆమె మాటలను బట్టి చూస్తే ఆ బంధం ముగిసిందని, అదే ఆమె దృష్టిలో ప్రేమ, పెళ్లిపై ఆసక్తి తగ్గడానికి కారణమై ఉండొచ్చని అర్థమవుతోంది. తెలుగులో ‘అలా మొదలైంది’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నిత్యా, ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’, ‘జనతా గ్యారేజ్’, ‘అ’, ‘భీమ్లా నాయక్’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ‘భీమ్లా నాయక్’ తర్వాత తెలుగు సినిమాలకు దూరమై, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో బిజీగా మారింది. ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ, తనదైన మార్క్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.