Hansika Motwani | ప్రముఖ నటి హన్సిక మోత్వానీకి బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. తనపై నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నటి సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ జేమ్స్ ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై 2024 డిసెంబర్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను వేధింపులకు గురి చేస్తున్నారని హన్సిక సోదరుడు భార్య ముస్కాన్ బాంబే పోలీసులకు ఫిర్యాదు చేరశారు. వాస్తవానికి ప్రశాంత్ మోత్వానీ, టీవీ నటి అయిన ముస్కాన్ 2020లో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల వారి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ముస్కాన్ భర్త ప్రశాంత్‌తో పాటు హన్సిక, అత్త జ్యోతిలపై గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అత్తవారింట్లో వేధింపులకు గురి చేస్తున్నారని.. తనకు రూ.20లక్షల నగదుతో పాటు విలువైన గిఫ్ట్స్ ఇవ్వాలని హన్సిక వేధింపులకు గురి చేసిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ముస్కాన్ ఫిర్యాదు మేరకు హన్సికతో పాటు మిగతా కుటుంబీకులపై పోలీసులు గృహహింస కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హన్సిక జ్యోతిలకు ముంబయి సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత తమపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన కోర్టు ముస్కాన్‌కు నోటీసులు జారీ చేసింది. పెళ్లి సమయంలో తన సోదరుడు వెడ్డింగ్ ప్లానర్‌కు రూ.27లక్షలు ఖర్చు చేశాడని.. విడాకులు తీసుకుంటున్నందున ఆ డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు ముస్కాన్ జేమ్స్ తనను లక్ష్యంగా చేసుకొని కేసు పెట్టిందని హన్సిక పేర్కొంది.
ఇప్పటి వరకు ఆ డబ్బులను తన సోదరుడు, జేమ్స్ ఇవ్వలేదని.. తిరిగి తనపై కేసు పెట్టడం దారుణమని పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా హన్సిక దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు మరోసారి విచారించింది. అయితే, హన్సిక దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా.. అత్తింటివారు తనను వేధిస్తున్నారని ముస్కాన్ కేసు పెట్టగా.. ప్రశాంత్ వాదనలు మరోలా ఉన్నాయి. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే ముస్కాన్ తనను తీవ్రంగా వేధించడం ప్రారంభించింది.. ఆమెతో కలిసి బతకలేక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆ కక్షతోనే తనపై కుటుంబంపై కేసు పెట్టిందని ఆరోపించారు.