హైదరాబాద్ కేంద్రంగా ఎంతోమంది కళాకారులకు ఉపాధి కల్పిస్తున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Telugu movie industry)కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏండ్లుగా ఆంధ్ర, రాయలసీమ యాసల్లోనే కుప్పలుతెప్పలుగా సినిమాలు వస్తున్న తరుణంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ట్రెండ్ మారి.. సినిమాలు తీసే విధానం మారిపోయింది. ఎంతలా అంటే ప్రతీ సినిమాలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ (Telangana backdrop films)ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.
సినిమాలో హీరో పాత్ర కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ తెలంగాణ యాసలో పెడితే థియేటర్లలో ఆ సినిమాకు వచ్చే రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఫిదా సినిమానే అందుకు ఉత్తమ ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ తర్వాత కూడా తెలంగాణ భాష, యాస ప్రధానంగా సినిమాలు తీయడంపై డైరెక్టర్లు, నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇవాళ అసెంబ్లీ సెషన్లో సీఎం కేసీఆర్ (CM KCR) సినిమాల విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సినిమాల్లో తెలంగాణ యాస ప్రాధాన్యం ఎంతలా పెరిగిందో చెప్పారు. తెలంగాణలో భాషా పరిరక్షణ జరిగిందని, ఇవాళ తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష పెడితేనే హీరో క్లిక్ అవుతున్నారని సీఎం కేసీఆర్ చెప్పగానే సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.