Hiranyakashyapa | హీరో రానా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశ్యప’ త్వరలో పట్టాలెక్కనుంది. శాండియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్లో రానా ఈ సినిమా ప్రకటన చేశారు. స్వీయ నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా పతాకంపై అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో రాక్షస రాజు హిరణ్యకశ్యపుడిగా రానా టైటిల్ రోల్‌ను పోషించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథా రచన చేయబోతున్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఇలాంటి గొప్ప కథను ప్రేక్షకులకు అందించడం గౌరవంగా భావిస్తున్నా.
ఈ సినిమా పూర్వ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని త్వరలో వెండితెరపై తీసుకొచ్చేందుకు మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అన్నారు. అయితే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎవరు చేపడతారనే విషయాన్ని మాత్రం రానా వెల్లడించలేదు. కొన్నేళ్ల క్రితమే గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అలస్యమవుతూ వచ్చింది.